Chalo Delhi : తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ 101 మంది రైతుల బృందం ఈరోజు “చలో ఢిల్లీ” పాదయాత్రను పునఃప్రారంభించింది. అయితే, రైతులను శంభు సరిహద్దు వద్ద హర్యాణా పోలీసులు అడ్డుకున్నారు. రైతులపై బాష్పవాయువు , జల ఫిరంగులను ప్రయోగించారు. దీంతో సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాంగ్రెస్ నాయకుడు, మల్లయోధుడు బజరంగ్ పునియా శంభు సరిహద్దులో రైతులతో కలిసిపోయారు. ఒకవైపు రైతులను ఆపడం లేదని ప్రభుత్వం చెబుతుంటే మరోవైపు బాష్పవాయువు ప్రయోగిస్తూ.. పాకిస్థాన్ సరిహద్దుగా వ్యవహరిస్తోందని.. నేతలు ఢిల్లీ వెళ్లి నిరసన తెలిపేందుకు , వారు అనుమతి తీసుకుంటారా?” అన్నాడు. ఇక రైతుల ఢిల్లీ చలో మార్చ్‌ను అడ్డుకోవడం ఇది మూడోసారి. డిసెంబర్ 6 నుంచి ఢిల్లీ వైపుకు వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా.. ఇప్పటికే ఆ ప్రయత్నాలను రెండుసార్లు పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో పోలీసుల తీరుపై రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లెవాల్ 19 రోజులుగా ఖనౌరీ సరిహద్దులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రం మరియు పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధులను దల్లేవాల్‌ను కలవాలని కోరారు. ఇక రైతుల ఢిల్లీ మార్చ్ నేపథ్యంలో హర్యాణా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ అర్ధరాత్రి వరకూ సేవలు నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
Read Also: Rohit Sharma Overweight: రోహిత్ శర్మ వెయిట్ పై డారిల్ కల్లినన్ కామెంట్స్ వైరల్