Farmers Protest : ఉత్తరాది రైతన్నలు మరోసారి రోడ్డెక్కారు. ఈ నెల 13న ‘చలో ఢిల్లీ’ ఆందోళనకు పిలుపునిచ్చారు. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ, సంయుక్త్ కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా వంటి 200కుపైగా రైతు సంఘాలు ఈ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను కల్పించడంతో పాటు గతంలో తాము ప్రతిపాదించిన డిమాండ్లను పరిష్కరించాలని అన్నదాతలు పట్టుబట్టుతున్నారు. ‘చలో ఢిల్లీ’ ఆందోళనలో దాదాపు 3 లక్షల మంది రైతులు(Farmers Protest) పాల్గొనే ఛాన్స్ ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి 500కుపైగా ట్రాక్టర్లలో రైతులు ప్రదర్శనగా ఢిల్లీకి బయలుదేరారు. ఈ నిరసన ప్రదర్శన కోసం ఢిల్లీలో పెద్ద ఎత్తున సన్నాహాలు చేపట్టారు. ఈ ర్యాలీని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టారు. హర్యానా, పంజాబ్ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించే మార్గాలను మూసేశారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి- ఘాజీపూర్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున అదనపు పోలీసు బలగాలను మోహరించారు. వాహనాలేవీ ఢిల్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేయడానికి సిమెంట్ దిమ్మెలనూ అందుబాటులో ఉంచారు. ఈ మార్గం గుండా రాకపోకలను సాగించే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఫిబ్రవరి 13న మార్చి నుంచి ఢిల్లీకి రైతులు పిలుపునివ్వనున్న నేపథ్యంలో సింగూ బార్డర్ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు.
హర్యానా సర్కారు వర్సెస్ పంజాబ్ సర్కారు
ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం ఫిబ్రవరి 13 వరకు పలు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. హర్యానా అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. వాయిస్ కాల్స్ మినహా మొబైల్ నెట్‌వర్క్‌లలో అందించబడిన బల్క్ SMS, అన్ని డాంగిల్ సేవలు నిలిపివేయబడతాయి. పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం.. ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చింది. రైతుల డిమాండ్లను పరిష్కరించాలని, వాటిపై సానుకూలంగా స్పందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని మోడీ సర్కారు దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2021లో రైతులు ఏడాది కాలం పాటు ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలను కొనసాగించారు. వారి నిరసనలకు అప్పట్లో కేంద్ర సర్కారు అనివార్య పరిస్థితుల్లో దిగొచ్చింది.