Site icon HashtagU Telugu

Fact Check : పార్లమెంటులోని అన్ని సీట్లపై అంబేద్కర్ ఫొటోలు.. నిజమేనా ?

Fact Check Ambedkars Picture Parliament Seats Ambedkar Amit Shah

Fact Checked By newsmeter

ప్రచారం: ‘‘కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నిరసన సందర్భంగా పార్లమెంటులోని అన్ని సీట్లపై అంబేద్కర్ ఫొటోలను ఉంచారు’’ అంటూ ఒక ఫొటో వైరల్ అవుతోంది.

వాస్తవం: ఆ ప్రచారం తప్పు. ఈ ఫొటో కర్ణాటక శాసనసభలోనిది. ఇది పార్లమెంటులోని ఫొటో కాదు.

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2024 డిసెంబర్ 18న రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును జపించడం ప్రతిపక్షాలకు ‘ఫ్యాషన్’గా(Fact Check) మారిపోయిందన్నారు. అంబేద్కర్‌ పేరుకు బదులుగా భగవాన్ శ్రీరాముడి పేరును స్మరిస్తే స్వర్గప్రాప్తి కలుగుతుందని విపక్షాలకు అమిత్ షా సూచించారు. ఈ వ్యాఖ్య చేసినందుకు విపక్షాల నుంచి అమిత్‌షా లక్ష్యంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై జోరుగా రాజకీయ చర్చ జరిగింది.

ఒక నెటిజన్ ఏం రాశాడంటే..

అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా న్యూఢిల్లీలోని పార్లమెంట్‌లో ఉన్న ప్రతీ సీటుపై అంబేద్కర్ ఫొటోలను ఉంచారంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఒక ఫేస్‌బుక్ వినియోగదారురాలు ఈ వైరల్ చిత్రాన్ని పోస్ట్ చేశాడు.   “ఇది వడోదరలో ఇల్లు దొరకని.. పాఠశాలలోని తరగతి గదిలో కూర్చోడానికి అనుమతి లభించని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యొక్క ఫొటో. ఆయన ఈరోజు పార్లమెంటులోని ప్రతి సీటులోనూ కూర్చున్నారు’’ అని ఈ పోస్ట్ చేసిన వ్యక్తి రాసుకొచ్చారు. ( ఆర్కైవ్ )

మరో నెటిజన్..

మరొక ఎక్స్ వినియోగదారుడు ఇదే  చిత్రాన్ని షేర్ చేసి , “బిగ్ బ్రేకింగ్: బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క ఫొటోను రాజ్యసభలోని ప్రతి ప్రతిపక్ష బెంచ్‌పై ఉంచారు.  జై భీమ్” అని రాసుకొచ్చారు. ( ఆర్కైవ్ )

ఇలాంటి ప్రచారాలు మరిన్ని ఇక్కడ , ఇక్కడ మరియు ఇక్కడ  మీరు చూడొచ్చు. ( ఆర్కైవ్ 1 , ఆర్కైవ్ 2 , ఆర్కైవ్ 3 )

వాస్తవ తనిఖీలో ఏం తేలింది ?

  • ఈ ప్రచారం తప్పు అని న్యూస్‌మీటర్ ఫ్యాక్ట్ చెకింగ్‌లో వెల్లడైంది.  ఈ ఫొటో పార్లమెంటులోనిది కాదు.. ఇది కర్ణాటక అసెంబ్లీలో తీసిన ఫొటో.
  • మేం రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. డిసెంబరు 19న హిందుస్తాన్ టైమ్స్ , ది న్యూస్ మినిట్, న్యూస్ తక్‌లలో పబ్లిష్ అయిన న్యూస్ స్టోరీలు దొరికాయి. వాటిని పరిశీలించగా.. కాంగ్రెస్ నాయకులు డిసెంబర్ 19న కర్ణాటక అసెంబ్లీలబెంచీలపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోలను ఉంచారని స్పష్టమైంది.అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఈవిధంగా తమతమ బెంచీలపై భారత రాజ్యాంగ నిర్మాత ఫొటోలను ఉంచారు.
  • కర్ణాటక కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతాలోనూ ఇదే విధమైన ఒక ఫొటోను షేర్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్ర శాసనసభలో ఈవిధంగా నిరసన తెలిపారని ఆ పోస్ట్‌లో ప్రస్తావించారు.
  • కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇదే ఫొటోను షేర్ చేశారు. అధికార పార్టీ సభ్యుల సీట్ల ఎదుట అంబేద్కర్‌ ఫొటోను ఉంచి శాసన సభలో నిరసన తెలిపామని ఆయన వెల్లడించారు.

పై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. పార్లమెంటులోని సీట్లపై అంబేద్కర్ ఫొటోలను డిస్‌ప్లే చేశారనే ప్రచారం అవాస్తవమని మేం తేల్చాం.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా న్యూస్ మీటర్ వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది)