జమ్మూ కాశ్మీర్‌లో అర్ధరాత్రి సంభవించిన భారీ పేలుడు రాష్ట్రాన్ని మరోసారి దిగ్భ్రాంతికి గురిచేసింది. శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ పేలుడులో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు గంటల కొద్దీ ముందే ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడును ప్రజలు మరచిపోకముందే మరో విపత్తు సంభవించడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పేలుడు శబ్దం అనేక కిలోమీటర్ల మేర వినిపించగా, భవనం పూర్తిగా ధ్వంసమై మంటలు చెలరేగాయి. సంఘటన స్థలానికి చేరుకున్న రక్షణ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఈ పేలుడు, ఇటీవల ఫరీదాబాద్‌లో 360 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసిన కేసుతో నేరుగా సంబంధం ఉన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఫరీదాబాద్ డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనై అద్దె ఇంట్లో స్వాధీనం చేసిన పేలుడు పదార్థాల్లో కొంత భాగాన్ని భద్రపరచడానికే నౌగామ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వాటిని ఫోరెన్సిక్ పరిశీలనకు సిద్ధం చేస్తుండగా ఆకస్మికంగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు మృతదేహాలు 300 అడుగుల దూరం వరకు ఎగిరి పడ్డాయని అధికారులు తెలిపారు. ఈ పేలుడుకు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, పోలీసులు రెండు కోణాల్లో– ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఉగ్రదాడా? అనే అనుమానాలతో దర్యాప్తు చేస్తున్నారు.
PM Modi: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందన ఇదే!
పోలీస్ స్టేషన్ ఆవరణలో నిలిపి ఉన్న స్వాధీనం చేసుకున్న కారులో ఐఈడీ అమర్చివుండవచ్చని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ దాడికి జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ PAFF బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది, అయితే దీనిపై అధికారిక ధృవీకరణ ఇంకా లేదు. సంఘటన స్థలాన్ని పూర్తిగా సీజ్ చేసిన భద్రతా దళాలు స్నిఫర్ డాగ్స్ సహాయంతో అన్వేషణ చేపట్టాయి. గాయపడిన వారిని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్న పోలీసు, వైద్య బృందాలను డిప్యూటీ కమిషనర్ అక్షయ్ లబ్రూ స్వయంగా పరిశీలించారు. ఢిల్లీలో కారు బాంబు పేలుడుతో దేశవ్యాప్తంగా పెరిగిన భద్రతా ఆందోళనల మధ్య ఈ ఘటన చోటుచేసుకోవడంతో, జమ్మూ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ అత్యవసర భద్రతా సమీక్ష నిర్వహించారు. దేశంలో పెరుగుతున్న ఉగ్ర ముప్పుల దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర భద్రతా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం స్పష్టమవుతోంది.
