Rahul Gandhi : ఒక వ్య‌క్తికి ఒకే ప‌ద‌వి: భార‌త్ జోడోలో రాహుల్‌

రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ లో కాంగ్రెస్ చేసిన డిక్ల‌రేష‌న్ ను భార‌త్ జోడో యాత్ర ఉన్న రాహుల్ గాంధీ గుర్తు చేశారు

  • Written By:
  • Publish Date - September 22, 2022 / 03:56 PM IST

రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ లో కాంగ్రెస్ చేసిన డిక్ల‌రేష‌న్ ను భార‌త్ జోడో యాత్ర ఉన్న రాహుల్ గాంధీ గుర్తు చేశారు. “ఒక వ్యక్తి, ఒకే పదవి” నియమాన్ని కాంగ్రెస్ పాటిస్తుంద‌ని వెల్ల‌డించారు. ఉద‌య్ పూర్లో మూడు రోజుల సమావేశంలో అంతర్గత సంస్కరణలు ఎన్నికల గురించి చర్చించిన‌ప్పుడు `ఒక వ్య‌క్తికి ఒకే ప‌ద‌వి` నిర్ణ‌యాన్ని తీసుకున్న విష‌యాన్ని రాహుల్ గుర్తు చేస్తూ ప‌రోక్షంగా అశోక్ గెహ్లాట్ సీఎం ప‌ద‌వి ఊడుతుంద‌ని సంకేతాలు ఇవ్వ‌డం కాంగ్రెస్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది.

కేరళలో జరిగిన మీడియా బ్రీఫింగ్‌లో రాహుల్ ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ఏఐసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి అంటే భార‌త దేశ‌పు భ‌విష్య‌త్ కు సంకేతంగా ఉంటుంద‌న్నారు. గాంధీయేత‌ర కుటుంబం నుంచి 71 ఏళ్ల అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపిక అవుతార‌ని తెలుస్తోంది. ఆయ‌న్ను గాంధీ కుటుంబం అధ్య‌క్ష రేస్ లో ఉంచనుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి ప‌ద‌విని గెహ్లాట్‌ వదులుకోవడానికి ఇష్టపడడు. ఒక వేళ సీఎం ప‌ద‌వి వ‌దులుకుంటే, ప్రత్యర్థి సచిన్ పైలట్ వస్తాడని గెహ్లాట్ కు తెలుసు. అతని తిరుగుబాటు 2020లో గెహ్లాట్‌ ప్రభుత్వాన్ని దాదాపు పడగొట్టినంత ప‌నిచేసింది.