Exit Polls:గుజరాత్‌లో కమలమే…హిమాచల్‌లో హోరాహోరీ ఎగ్జిట్ పోల్స్‌ అంచనా

గుజరాత్ (Gujarat) గడ్డ..మోదీ-షా అడ్డా అని తేల్చేశాయి ఎగ్జిట్‌ పోల్స్‌ (Exit Polls). రాష్ట్రంలో మళ్లీ బీజేపీదే అధికారమని స్పష్టం చేశాయి.

  • Written By:
  • Publish Date - December 5, 2022 / 08:28 PM IST

గుజరాత్ (Gujarat) గడ్డ..మోదీ-షా అడ్డా అని తేల్చేశాయి ఎగ్జిట్‌ పోల్స్‌ (Exit Polls). రాష్ట్రంలో మళ్లీ బీజేపీదే అధికారమని స్పష్టం చేశాయి.
వరుసగా ఏడోసారి కమలదళం విజయఢంకా మోగిస్తుందని అంచనా వేశాయి. రికార్డు స్థాయిలో సీట్లు సాధిస్తుందని అంచనా వేశాయి. మోదీ మ్యాజిక్‌తో గుజరాత్‌లో బీజేపీ 140కి స్థానాలు దక్కించుకుంటుందని అంచనా వేశాయి జన్‌కీ బాత్‌, రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్స్‌. కాంగ్రెస్‌ గట్టిగానే పోటీ ఇచ్చినా.. ఆప్ మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదని చెబుతున్నాయి సర్వేలు. కాంగ్రెస్‌, ఆప్‌, ఇతర పార్టీల ఓట్ల చీలికతో అధికార పార్టీకి భారీగా ప్రయోజనం చేకూరిందని అంచనా వేశాయి. గుజరాత్‌లో రెండు దశలో పోలింగ్‌ జరిగింది. తొలిదశలో 63 శాతం, రెండో దశలో 65 శాతం ఓటింగ్ నమోదైంది.

ఇక హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ తలపడ్డాయి బీజేపీ, కాంగ్రెస్.. రెండు పార్టీల మధ్య నువ్వానేనా అన్నట్టు పోటీ జరిగిందని అంచనా వేశాయి ఎగ్జిట్‌ పోల్స్‌. కొన్ని సర్వేలు కాంగ్రెస్‌కు ఎడ్జ్ ఉందని చెబితే.. మరికొన్ని మాత్రం బీజేపీ వైపే మొగ్గు చూపాయి. దీంతో హిమగిరుల్లో పాగా వేసేది ఎవరు అనేది ఉత్కంఠభరితంగా మారింది. 1990 నుంచి హిమాచల్‌లో ఐదేళ్లకోసారి అధికారం చేతులు మారడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ట్రెండ్‌కు బ్రేక్ వేయాలని బీజేపీ గట్టిగా ప్రయత్నించింది. ప్రధాని మోదీ స్టేట్‌పై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టి విస్తృతస్థాయిలో ప్రచారం చేశారు. ధరల పెరుగుదల, ఓల్డ్ పెన్షన్‌ స్కీమ్‌ వంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్లింది కాంగ్రెస్‌. డిసెంబర్ 8న గుజరాత్ , హిమాచల్ ఫలితాలు వెల్లడికానున్నాయి.

మరోవైపు దేశ రాజధానిలో మోదీ-షాపై కేజ్రీవాల్ మరోసారి పైచేయి సాధించబోతున్నారా..? 15 ఏళ్లుగా కార్పొరేషన్‌ను ఏలుతున్న కమలానికి చీపురు చెక్‌ పెట్టబోతోందా..? అంటే ఔననే అంటున్నాయి ఎగ్జిట్‌ పోల్స్‌. MCD ఎన్నికలను చీపురు ఊడ్చిపారేస్తుందని అంచనా వేశాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించనుందని అంచనా వేశాయి ఎగ్జిట్‌ పోల్స్‌. తొలిసారి MCDలో కేజ్రీవాల్‌ పార్టీ పాగా వేస్తుందని స్పష్టం చేశాయి. ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్‌ 149 నంచి 171 వార్డులు దక్కించుకుంటుందని అంచనా వేసింది ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే. 150కిపైగా వార్డులు ఆమ్ ఆద్మీ అకౌంట్‌లో పడతాయని టైమ్స్‌ నౌ, న్యూస్‌X సర్వేలు చెప్పాయి. కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందని తేల్చేశాయి. మూడు కార్పొరేషన్‌లు విలీనం తర్వాత తొలిసారి MCDకి జరిగిన ఎన్నికలు ఇవి. 250 వార్డులకు ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 7న MCD ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Read More: CM KCR : కేసీఆర్ మాయ‌! జై భార‌త్, జై తెలంగాణ క‌నిక‌ట్టు!