Exit Polls: యూపీ బీజేపీదే.. పంజాబ్‌లో ఆప్‌ ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ రాష్ట్రాల్లో దేశంలోని అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కూడా ఉండటంతో.. అందరి దృష్టి ఈ ఎన్నికలపై నెలకొంది.

  • Written By:
  • Publish Date - March 7, 2022 / 08:34 PM IST

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ రాష్ట్రాల్లో దేశంలోని అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కూడా ఉండటంతో.. అందరి దృష్టి ఈ ఎన్నికలపై నెలకొంది. యూపీలో చివరి విడత ఎన్నికలు కూడా పూర్తి కావడంతో.. ఎగ్జిట్ పోల్ అంచనాలను పలు మీడియా సంస్థలు ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్‌లో మరోసారి కమలం వికసిస్తుందని ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. దాదాపు అన్ని సర్వే సంస్థలూ.. బీజేపీవైపే మొగ్గుచూపాయి. అయితే.. 2017 ఎన్నికల్లో 312 సీట్లు సాధించిన బీజేపీ.. ఈసారి మాత్రం సీట్ల సంఖ్య భారీగానే తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేశాయి. అటు.. గత ఎన్నికల్లో 47 సీట్లకే పరిమితమైన సమాజ్‌ వాదీ పార్టీ ఈసారి అనూహ్యంగా పుంజుకుంటుందని పేర్కొన్నాయి. 120 నుంచి 160 స్థానాల్లో ఎస్పీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. ఇక స్థిరమైన ఓటు బ్యాంకు కలిగిన బీఎస్పీ.. గత ఎన్నికల ఫలితాలే సాధిస్తుందని తెలిపాయి. కాంగ్రెస్‌ కూడా ఈసారి కూడా ఎదురుదెబ్బ తప్పదని, కేవలం 2 నుంచి 6 స్థానాలకే ఆ పార్టీ పరిమితమవుతుందని ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు తెలిపాయి.

పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తప్పదని ఎగ్జిట్‌ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని పేర్కొన్నాయి. ముఖ్యమంత్రిగా 37శాతంమంది ప్రజలు భగవంత్ మాన్ సింగ్‌కు మద్దతు పలికినట్టు సర్వేలు చెబుతున్నాయి. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం 76 నుంచి 90 స్థానాలు గెలుస్తుందని అంచనా వేసింది. పీమార్క్ సర్వే ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీకి 62 నుంచి 70 సీట్లు రావచ్చని చెప్పింది. మిగిలిన సర్వేలు సైతం పంజాబ్‌లో ఆప్‌దే విజయం అని అంచనా వేశాయి.

దేవభూమి ఉత్తరాఖండ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య తీవ్ర పోటీ ఉన్నట్లు ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు పేర్కొన్నాయి. 70 స్థానాలు కలిగిన ఉత్తరాఖండ్‌లో.. వరుసగా రెండో సారి అధికార పగ్గాలు చేపట్టి అనుకుంటున్న కమలనాథులకు.. కొంత ఇబ్బందికర పరిస్థితులు తప్పేలా లేవని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్‌, కమలం మధ్య హోరాహోరీ పోరు ఉందని, ఈసారి హంగ్‌ ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇతరుల ఓట్లు కీలకం కానున్నట్లు తెలిపాయి.

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఈసారి కూడా బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెల్లడించాయి. రెండు విడతల్లో పోలింగ్‌ జరిగిన మణిపూర్‌లో కాంగ్రెస్‌, బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్వీళ్లూరుతుంటే పునర్‌ వైభవం కోసం కాంగ్రెస్‌ ప్రయత్నించడం ఈశాన్య రాష్ట్ర రాజకీయాన్ని రసవత్తరంగా మార్చింది. అయితే.. ఎగ్జిట్‌ పోల్స్‌ మాత్రం.. బీజేపీ వైపే మొగ్గుచూపాయి.

పర్యాటక రాష్ట్రం గోవాలో ఈసారి కూడా బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రెండు జాతీయ పార్టీలు స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాలు లేనట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. 2017 ఫలితాలే మళ్లీ పునరావృత్తం అయ్యే అవకాశం కనిపిస్తున్నట్లు తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటులో ఆప్‌, ఇతరులే కీలకం కానున్నారు.