Bypoll Results : ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం మొదలైంది. పలు స్థానాల్లో బీజేపీకి(BJP) ప్రతిపక్ష ఇండియా కూటమి(INDIA) గట్టి పోటీ ఇస్తోంది. పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, బీహార్ రాష్ట్రాల్లోని కీలక నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు మొదలైంది. ఈ స్థానాలకు జూలై 10న జరిగిన బై పోల్స్‌లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ అభ్యర్థులు తలపడ్డారు.
We’re now on WhatsApp. Click to Join
ఓట్ల ఆధిక్యం వివరాలివీ..
- తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్‌లోని నాలుగు స్థానాల్లో పోటీ చేయగా ఆ పార్టీ అభ్యర్థి మధుపూర్ణ ఠాకూర్ బాగ్దాలో 12,444 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రణఘాట్, మానిక్తలా, రాయ్‌గంజ్‌లలో కూడా టీఎంసీ అభ్యర్థులు ఆధిక్యంలో(Bypoll Results )ఉన్నారు.
- ఉత్తరాఖండ్‌లోని మంగ్లౌర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఖాజీ నిజాముద్దీన్ 12,540 ఓట్లతో ముందంజలో ఉండగా, బీఎస్పీ అభ్యర్థి ఉబెదుర్ రెహ్మాన్ తర్వాతి స్థానంలో ఉన్నారు.
- బద్రీనాథ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి లఖ్‌పత్ సింగ్ బుటోలా ఆధిక్యంలో ఉన్నారు. ఆయన బీజేపీకి చెందిన రాజేంద్ర భండారీతో తలపడుతున్నారు.
- పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్ సీటులో అధికార ఆప్ ఆధిక్యంలో ఉంది. ఆప్ అభ్యర్థి మొహిందర్ భగత్ దాదాపు 10 రౌండ్ల కౌంటింగ్ తర్వాత 42,007 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సురీందర్ కౌర్ 13,727 ఓట్లతో వెనుకబడి ఉన్నారు. బీజేపీకి చెందిన శీతల్ అంగురల్ తర్వాతి స్థానంలో ఉన్నారు. ఆప్ శాసనసభ్యుడు అంగురల్ బీజేపీలోకి జంప్ చేయడంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగాయి.
- తమిళనాడులోని విక్రవాండి అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార డీఎంకే అభ్యర్థి అన్నియూర్ శివ (అలియాస్ శివషణ్ముగం ఏ) ముందంజలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో సి అన్బుమణి, కె అభినయ ఉన్నారు.
-
బీహార్‌లోని రూపాలీ ఉప ఎన్నికలో జెడి(యు)కి చెందిన కళాధర్ ప్రసాద్ మండల్ తన సమీప స్వతంత్ర ప్రత్యర్థిపై 2,433 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆర్జేడీ అభ్యర్థి బీమా భారతి 2,359 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆర్‌జేడీ టికెటుపై పోటీ చేసేందుకు జేడీయూకు బీమా భారతి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది.
-
మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా అమర్వారా నియోజకవర్గంలో బీజేపీకి చెందిన కమలేష్ ప్రతాప్ షా కాంగ్రెస్ అభ్యర్థి ధీరన్ షా ఇన్వతిపై 4,160 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
-
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పుంజుకుంది. ఉప ఎన్నికలకు వెళ్లిన మూడు స్థానాల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. డెహ్రాలో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సుఖు భార్య కమలేష్ ఠాకూర్ 16,984 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి హోషియార్ సింగ్ 15,169 ఓట్లతో వెనుకబడ్డారు.
-
హమీర్‌పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఆశిష్ శర్మపై కాంగ్రెస్ అభ్యర్థి పుష్పిందర్ వర్మ 1,707 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. నలాగఢ్‌లో బీజేపీ అభ్యర్థి కేఎల్ ఠాకూర్‌పై కాంగ్రెస్‌కు చెందిన హర్దీప్ సింగ్ బావా 1,571 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.