గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ ర‌ద్దుకు ఆనాడే ఎన్టీఆర్ సై.. లంచ‌గొండిత‌నం బ‌య‌ట‌పెట్టిన మాలిక్‌

  • Written By:
  • Publish Date - October 26, 2021 / 06:00 PM IST

అంబానీ, ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన ఓ వ్య‌క్తికి సంబంధించిన ఫైళ్ల‌ను క్లియ‌ర్ చేస్తే 300కోట్లు లంచం ఇవ్వ‌చూపిన వైనాన్ని మాలిక్‌ వెల్ల‌డించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని చెబుతోన్న ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ‌లోని లంచ‌గొండిత‌నంపై గళం విప్పారు. దీంతో మ‌రోసారి దేశంలోని గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ మీద చ‌ర్చ జ‌రుగుతోంది.

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ను ప‌ద‌వీచ్యుతుడ్ని చేసిన సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను తెలుగు ప్ర‌జ‌లు క‌ళ్లారా చూశారు. ఆనాడు గుండె ఆప‌రేష‌న్ కు వెళ్లిన ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ ప‌ద‌విని ఒక సంత‌కంతో ఊడ‌గొట్టిన గ‌వ‌ర్న‌ర్ రామ్ లాల్ వ్య‌వ‌హారంపై తెలుగు ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ్డారు. గుండె ఆప‌రేష‌న్ ముగించుకుని తిరిగి వ‌చ్చే నాటికి ఎన్టీఆర్ స్థానంలో నాదెండ్ల భాస్క‌ర‌రావును సీఎంగా కూర్చొపెట్టారు ఇందిరాగాంధీ. అప్ప‌టికే కంపుప‌ట్టిన గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ‌ను ఇందిరా మ‌రింత దిగ‌జార్చార‌నే ఆరోప‌ణ‌లు ఇప్ప‌టికీ ఆమె మీద బ‌లంగా ఉన్నాయి. రాజ‌కీయ కేంద్రాలుగా రాజ్ భ‌వ‌న్ ల‌ను ఆనాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వం మార్చేసింది. ప్ర‌త్యర్థి పార్టీల ముఖ్య‌మంత్రులను అధికారం నుంచి దింప‌డానికి గ‌వ‌ర్న‌ర్ల‌ను వినియోగించుకున్న వైనాలు భారత‌దేశంలో అనేకం.అందుకే, ఆ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాల‌ని ఎన్టీఆర్ తీర్మానం చేసి సంచ‌ల‌నం లేపాడు.

స్వాతంత్య్రానికి ముందే మన దేశంలో గవర్నర్ల వ్యవస్థ ఏర్పడింది. కేంద్రం తరపున రాష్ట్రంలో రాజ్యాంగాధినేతగా ఒక పెద్దమనిషి పాత్ర అవసరమని నాటి రాజ్యాంగకర్తలు భావించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన టి.వెంకటసుబ్బయ్య కర్ణాటక గవర్నర్‌గా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్.ఆర్.బొమ్మై ప్రభుత్వాన్ని అస్థిరపరిచారు. ఆ క్రమంలో సుప్రీంకోర్టు చేసిన తీవ్రవాఖ్యలు కేంద్ర ప్ర‌భుత్వం క‌ళ్లు తెరిపించ‌లేదు. పైగా రాజ‌కీయ పున‌రావాస కేంద్రాలుగా మారిపోయాయి. ఆయా రాజ‌కీయా పార్టీల‌లో కురువృద్దులుగా ఉండే వాళ్ల‌ను రాజ్ భ‌వ‌న్లో కూర్చోపెడుతోంది. కేంద్ర ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉండే వ్య‌వ‌స్థ‌గా మారిపోయింది. ముఖ్య‌మంత్రులను దింప‌డానికి, కేంద్రం చెప్పిన‌ట్టు న‌డుచుకునే ర‌బ్బ‌ర్ స్టాంప్ ల్లా గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ ఉంది.కాంగ్రెస్ హ‌యాంలో భ్ర‌ష్టుపట్టిన ఈ వ్య‌వ‌స్థ‌ను నరేంద్ర మోదీ మ‌రింత దిగ‌జార్చారు. ఆయ‌న హ‌యాంలో సుమారు 25 మంది వివిధ రాష్ర్టాల గవర్నర్లుగా నియమితులయ్యారు. వీరిలో దాదాపుగా అంద‌రూ రాజ‌కీయ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన వాళ్లే. అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖం డ్, మణిపూర్, గోవా, కర్ణాటక రాష్ర్టాల గవర్నర్‌ల చర్యలు తీవ్ర విమర్శలకు దారితీసాయి. క‌ర్నాట‌క గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హారం ఆ మ‌ధ్య వివాద‌స్ప‌దం అయింది. ఇప్పుడు తాజాగా రాజ్ భ‌వ‌న్లు అవినీతి నిల‌యాల‌ని మాజీ గ‌వ‌ర్న‌ర్ మ‌ల్లిక్ ప‌రోక్షంగా చెప్ప‌డం గ‌మ‌నార్హం.