రాత్రికి రాత్రే బ్రిడ్జిని మాయం చేసిన దొంగలు

ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంత బరువున్న మెటీరియల్‌ను రవాణా చేయడానికి వారు లారీలు లేదా ట్రక్కులను ఉపయోగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Thieves Bridge Overnight

Thieves Bridge Overnight

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో జరిగిన ఒక వింతైన మరియు దిగ్భ్రాంతికరమైన దొంగతనం వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏకంగా 70 అడుగుల పొడవు ఉన్న భారీ స్టీల్ బ్రిడ్జిని దొంగలు మాయం చేయడం స్థానికులను, పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. కోర్బాలోని హల్దేవ్ లెఫ్ట్ కెనాల్‌పై సుమారు 40 ఏళ్ల క్రితం ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. సుమారు 10 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉండే ఈ భారీ నిర్మాణాన్ని దొంగలు ఒకే రాత్రిలో మాయం చేశారు. సాధారణంగా ఇలాంటి భారీ నిర్మాణాలను తొలగించాలంటే భారీ యంత్రాలు, గ్యాస్ కట్టర్లు మరియు గంటల తరబడి శ్రమ అవసరం. అయితే, రాత్రికి రాత్రే ఎవరికీ అనుమానం రాకుండా బ్రిడ్జిని ముక్కలు చేసి తీసుకెళ్లడం చూస్తుంటే, దొంగలు ఎంత పక్కా స్కెచ్‌తో వచ్చారో అర్థమవుతోంది. మరుసటి రోజు ఉదయం స్థానికులు వచ్చి చూసేసరికి అక్కడ బ్రిడ్జి లేకపోవడంతో షాక్‌కు గురయ్యారు.

ఈ అసాధారణ దొంగతనంపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. సుమారు 15 మంది సభ్యుల ముఠా కలిసి ఈ బ్రిడ్జిని గ్యాస్ కట్టర్లతో ముక్కలు ముక్కలుగా కట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆ స్టీల్ ముక్కలను తుక్కు (Scrap) కింద విక్రయించేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంత బరువున్న మెటీరియల్‌ను రవాణా చేయడానికి వారు లారీలు లేదా ట్రక్కులను ఉపయోగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కరువైందనడానికి ఈ ఘటనే నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు. 10 టన్నుల బరువున్న బ్రిడ్జిని కట్ చేస్తున్నప్పుడు వచ్చే శబ్దాలను గానీ, వాహనాల కదలికలను గానీ అధికారులు గుర్తించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాతబడిన నిర్మాణాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే దొంగలు ఇలాంటి సాహసాలకు ఒడిగడుతున్నారని తెలుస్తోంది. గతంలోనూ బీహార్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి వింత దొంగతనాలు జరిగినప్పటికీ, ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో ఇది పునరావృతం కావడం గమనార్హం.

  Last Updated: 24 Jan 2026, 08:47 PM IST