2 Naxalites Killed: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో శనివారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. ఈ మేరకు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కోయలిబెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో రాష్ట్ర పోలీసు దళానికి చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) బృందం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించింది. దీంతో పోలీసులకు, మావోల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ఇద్దరు నక్సల్స్ మరణించారు.
ఎదురుకాల్పుల తర్వాత ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలతో పాటు ఒక ఇన్సాస్ రైఫిల్, ఒక 12-బోర్ రైఫిల్, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సంఘటనా స్థలం నుండి స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ పి తెలిపారు. మరణించిన నక్సలైట్ల గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉందని, సమీప ప్రాంతాల్లో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారి తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7న జరగనున్న రెండు దశల ఎన్నికలలో మొదటి దశ పోలింగ్ జరగనున్న 20 అసెంబ్లీ స్థానాల్లో కంకేర్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలు కూడా ఉన్నాయి.