Delhi Polls Schedule : ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. విలేకరుల సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ వివరాలను ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీని కాలపరిమితి ఫిబ్రవరి 23వ తేదీతో ముగియనుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం.. ఫిబ్రవరి 23 కంటే ముందే అసెంబ్లీ పోల్స్‌ను నిర్వహించనున్నారు. వచ్చే నెల (ఫిబ్రవరి) రెండోవారం కంటే ముందే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. 2020 సంవత్సరంలో ఫిబ్రవరి 8న ఢిల్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలను ఫిబ్రవరి 11న ప్రకటించారు. రాంలీలా మైదాన్ వేదికగా ఫిబ్రవరి 16న మూడోసారి ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ అప్పట్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటివరకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలన్నీ ఒకే విడతలో జరిగాయి. ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం(Delhi Polls Schedule) ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తుందా ? లేదా ? అనేది మధ్యాహ్నం కల్లా తెలిసిపోతుంది.
Also Read :Kamala Certified Trump : డొనాల్డ్ ట్రంప్ గెలుపును సర్టిఫై చేసిన కమల.. ఎందుకు ?
2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 67 అసెంబ్లీ సీట్లను గెల్చుకుంది. 2020లో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో 63 సీట్లను ఆప్ కైవసం చేసుకుంది. ఈసారి ఆప్‌కు బలమైన పోటీ ఇచ్చేందుకు బీజేపీ ముమ్మర కసరత్తు చేస్తోంది. చాలామంది ఆప్ అగ్రనేతలు ఇప్పటికే అవినీతి కేసులను ఎదుర్కొంటున్నారు. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా నుంచి మొదలుకొని ఇంకొందరు ఆప్ కీలక నేతలు వివిధ కేసుల వలయంలో ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయా కేసుల్లో వేగాన్ని పెంచే అవకాశం లేకపోలేదు. గత లోక్‌సభ ఎన్నికల టైంలోనూ అలాగే జరిగింది. అరవింద్ కేజ్రీవాల్‌ను సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు అరెస్టు చేయగా.. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ పోల్స్‌కు అభ్యర్థులను ప్రకటించే విషయంలో ఆప్ ముందంజలో ఉంది. తాజాగా ఆదివారం రోజు 38 మంది అభ్యర్థులతో నాలుగో లిస్టును ఆప్ విడుదల చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తోంది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి అరవింద్ కేజ్రీవాల్ వరుసగా నాలుగోసారి పోటీ చేస్తున్నారు. కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి సీఎం అతిషి పోటీ చేస్తున్నారు.