Site icon HashtagU Telugu

Lok Sabha Polls : ఏప్రిల్ 16.. లోక్‌సభ పోల్స్ తేదీపై క్లారిటీ ఇచ్చిన ఈసీ

Assembly Polls

Assembly Polls

Lok Sabha Polls :  2024 లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తేదీపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ 16న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగొచ్చంటూ ఇటీవల ఈసీ విడుదల చేసిన సర్క్యులర్‌పై మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల సమరం తేదీ అదే (ఏప్రిల్ 16) అంటూ ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది.తాము ఎన్నికల కోసం అధికార యంత్రాంగాలను సమాయత్తం చేసేందుకు మాత్రమే ఆ తేదీని ప్రస్తావించామని ఈసీ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తేదీ అది కాదని తేల్చి చెప్పింది. ఆ సమయానికి ఎన్నికల టీమ్‌ను(Lok Sabha Polls) సంసిద్దులను చేసేందుకు ఈ తేదీని జారీ చేశామని పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join.

15 ఏండ్లకోసారి 10 వేల కోట్ల రూపాయలు

దేశంలో ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఈవీఎం)ల నిమిత్తం ప్రతి 15 ఏండ్లకోసారి 10 వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని భారత ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు అంచనాలతో కేంద్ర న్యాయ శాఖకు ఇటీవల వివరాలను పంపింది. ప్రస్తుతమున్న ఈవీఎంల జీవిత కాలం 15 ఏండ్లని, జమిలి ఎన్నికలను వరుసగా మూడుసార్లు నిర్వహించడానికి వాటిని వినియోగించవచ్చునని ఈసీ తెలిపింది. ఈ ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు 11.80 లక్షల పోలింగ్‌ స్టేషన్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నామంది. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఒక్కో పోలింగ్‌ బూత్‌కు రెండు సెట్ల ఈవీఎంలు అవసరమవుతాయని, అందులో ఒకదానిని లోక్‌సభకు, రెండో దానిని అసెంబ్లీ పోలింగ్‌కు వినియోగిస్తామన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలింగ్‌ తేదీన కంట్రోల్‌, బ్యాలెట్‌ యూనిట్లు, వీవీప్యాట్‌ మిషన్లు కొన్ని రిజర్వ్‌లో ఉంచాలన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే జమిలి ఎన్నికలకు కనీసం 46,75,100 బీయూలు, 33,63,300 సీయూలు, 36,62,600 వీవీప్యాట్‌లు అవసరమవుతాయని వివరించింది.

రామ్‌నాథ్‌ కోవింద్‌ చర్చలు

మాజీ ఎన్నికల ప్రధానాధికారులు, హైకోర్టుల మాజీ చీఫ్‌ జస్టిస్‌లతో ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పై ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ ఛైర్‌పర్సన్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ చర్చలు ప్రారంభించారు. ఇటీవల ఆయన మద్రాస్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మునీశ్వర్‌ నాథ్‌ భండారీ,  ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ గొర్ల రోహిణిలతో సమావేశమయ్యారు. మాజీ సీఈసీ సుశీల్‌ చంద్రతోనూ భేటీ అయ్యారు. వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ చర్చల ప్రక్రియ మరికొన్ని రోజులపాటు కొనసాగనుంది.

Also Read: KVP : రంగంలోకి రాజకీయ మాంత్రికుడు.. వైసీపీ అసంతృప్తులు టార్గెట్‌గా వ్యూహరచన

కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఈవీఎంలు, వీవీప్యాట్‌ల పనితీరు గురించి ప్రజలకు తెలియజేసే అవగాహనా కార్యక్రమాన్ని గత గురువారం దేశవ్యాప్తంగా ప్రారంభించింది. వీటి పనితీరు గురించి ప్రజలకు ప్రత్యక్షంగా తెలియజేసేందుకు దేశవ్యాప్తంగా 3,500 కేంద్రాలు, 4,250 మొబైల్‌ వ్యాన్లను ఏర్పాటు చేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్‌లు ఎలా పని చేస్తాయి.. ఓటు వేసే సమయంలో ఎలా వ్యవహరించాలన్న విషయాలను ఈ కార్యక్రమం ద్వారా ఎన్నికల అధికారులు ప్రజలకు వివరించారు. ఈవీఎంలపై ప్రజల మనసుల్లో ఉన్న అనుమానాలను తొలగించి, ఓటింగ్‌పట్ల వారికి విశ్వాసం పెంచి ఎక్కువ మంది పోలింగ్‌లో పాల్గొనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఈసీఐ నిర్వహించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 5 రాష్ట్రాలు మినహాయించి మిగిలిన 31 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 613 జిల్లాల పరిధిలో ఉన్న 3,464 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ అవగాహన కార్యక్రమాన్ని ఈసీఐ నిర్వహించింది. ఎన్నికల సంఘం ప్రామాణిక నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రకటన వెలువడటానికి 3 నెలల ముందు రాష్ట్రాల ఎన్నికల ముఖ్య అధికారులు ఇలాంటి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం తప్పనిసరి.