Site icon HashtagU Telugu

Maharashtra : ముఖ్యమంత్రి పదవికి ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా

Eknath Shinde Resigns as Maharashtra Chief Minister

Eknath Shinde Resigns as Maharashtra Chief Minister

Eknath Shinde : మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా చేశారు. ఈ మేరకు ఏక్‌నాథ్‌ షిండే ఈరోజు ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. షిండే వెంట డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. అయితే కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకూ ఏక్‌నాథ్‌ షిండే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని షిండేను గవర్నర్ కోరారు.

కాగా, కొత్త సీఎం అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. బీజేపీ పెద్దలు, శివసేన, ఎన్సీపీ నేడు సమావేశమై తుది నిర్ణయం తీసుకొనే అవకాశముంది. మహాయుతి కూటమి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ.. బీజేపీకి 132, శివసేనకు 57, ఎన్సీపీకి 41 స్థానాలు లభించాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. ఇక, ప్రస్తుత అసెంబ్లీ గడువు నేటితో ముగియనుంది.

అయితే, ఈ ఎన్నికల్లో అధిక సీట్లు సాధించిన బీజేపీనే సీఎం పదవి చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అజిత్‌ పవార్‌ కూడా ఫడ్నవీస్‌కే మద్దతు తెలిపినట్లు సమాచారం. ఈ లెక్కన ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీసే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఏక్‌నాథ్‌ షిండే ను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని శివసేన గట్టిగా పట్టుబడుతున్నది. దీంతో ఈ వ్యవహారం మహా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ రాత్రికి సీఎం అభ్యర్థిపై ఓ స్పష్టత రానున్నట్లు సమాచారం.

మరోవైపు శాసనసభ ప్రాంగణంలో ప్రమాణస్వీకారాలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి చెందిన 10 మంది, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్‌)కి చెందిన అయిదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎవరి నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్‌ కొలువుదీరనుందనే విషయాలపై ఈరోజు స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

Read Also: Vivo Y300 5G: కేవలం రూ.43 తో వివో స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చట.. అదెలా అంటే!