Kamal Haasan : చదువు, సామాజిక మార్పులకే కాదు దేశాన్నే మారుస్తుందని విశ్వసించిన ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్, విద్యను బలంగా పట్టుకోవాలని ప్రజలకు సూచించారు. తమిళనాడులోని అగరం ఫౌండేషన్ నిర్వహించిన విద్యా సంబంధిత ఒక కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హాసన్, సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన బానిసత్వాన్ని అంతం చేయగల ఏకైక ఆయుధం చదువే. ప్రజలు గద్దలు, ఆయుధాలు కాదు… పుస్తకాలను చేతిలోకి తీసుకోవాలి. ఎందుకంటే అజ్ఞానం చేతిలో ఓడిపోతాం. మూర్ఖులే ఎక్కువైతే మన సమాజం వెనక్కి పోతుంది అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. సినీ నటుడు సూర్య స్థాపించిన అగరం ఫౌండేషన్ విద్య ద్వారా సామాజిక మార్పు కోసం పనిచేస్తోన్నది తెలిసిందే. ఈ సంస్థ కార్యక్రమంలో పాల్గొన్న కమల్, విద్యా అవసరం, సామాజిక బాధ్యతల గురించి గంభీరంగా మాట్లాడారు. విద్య లేకుండా విజయం సాధించడం అసాధ్యం. ఎందుకంటే బహుళ మూర్ఖులు గెలవగల సామర్థ్యం కలిగి ఉన్నారు. అటువంటి సమాజాన్ని శుద్ధి చేయాలంటే విద్యే మార్గం అని పేర్కొన్నారు.
నీట్ విధానంపై తీవ్ర విమర్శలు
విద్యలో సమానత్వం విషయంలో ప్రస్తుతం ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ, ‘నీట్’ (NEET) విధానంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. 2017 తర్వాత ఈ ప్రవేశ పరీక్ష కారణంగా వెనుకబడిన తరగతుల విద్యార్థులు తమ వైద్య విద్య కలలను నెరవేర్చలేకపోతున్నారు. ఇది వారి ప్రయత్నాలను అడ్డుకుంటోంది. డాక్టర్ కావాలనే కలలు కన్నా అనేకమంది మధ్య తరగతి, పేద కుటుంబాల విద్యార్థులు మానిపోతున్నారు. ఈ విధానం సామాజిక సమానత్వానికి వ్యతిరేకంగా మారింది. అని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఈ తరహా డాక్టర్లు మళ్లీ కనిపించరు. నీట్ అనే విధానం అణగారిన వర్గాల పిల్లల ఎదుగుదలకు గండికొడుతోంది. అది చదువునే అడ్డుకుంటోంది. చదువే దాన్ని మార్చే శక్తిని మనకు ఇస్తుంది అని కమల్ హాసన్ స్పష్టం చేశారు.
సినిమా కంటే సామాజిక సేవ విలువైనది
కమల్ హాసన్ తన రాజకీయ ప్రయాణంలో చదువును కీలకంగా భావిస్తున్నట్లు తెలిపారు. సినిమాలో మంచి నటనకు బహుమతి ఉంటుంది, కానీ సామాజిక సేవకు ముళ్ల కిరీటం లభిస్తుంది. ఆ ముళ్ల కిరీటాన్ని ధరిస్తే గర్వంగా ఉండాలి. ఎందుకంటే మనకోసం ఎవరూ సేవ చేయరని తెలుసుకోవాలి. మనమే చేయాలి. అదే నిజమైన నాయకత్వం అని ఆయన పేర్కొన్నారు.
స్వచ్ఛంద సంస్థలపై ముఖ్యమంత్రికి విజ్ఞప్తి
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో జరిగిన తన ముఖాముఖిని గుర్తు చేస్తూ కమల్ చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాన్ని డబ్బు కోసం అడగడం లేదు. కేవలం సేవ చేసే అవకాశం ఇవ్వండి అంటున్నాయి. ఇది ముఖ్యమంత్రి గారికి చెప్పాను. ఆయన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇది నా జీవితంలో గర్వకారణమైన క్షణం అని అన్నారు. విద్య ద్వారా మాత్రమే సమాజంలో బలమైన మార్పు సాధ్యమని, అందుకు ప్రభుత్వాలు విద్యా వ్యవస్థలో పెట్టుబడి పెట్టాలని కోరారు. సామాజిక సాధికారతకు ఇది అత్యవసరం. చదువు ద్వారా నైపుణ్యం పెరుగుతుంది. అది స్వయం సమృద్ధికి దారితీస్తుంది. చదువే నిజమైన శక్తి, అని ఆయన తన సందేశాన్ని ముగించారు.
Read Also: BC Reservations : కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇందుకు కృషి చేయాలి: ఎమ్మెల్సీ కవిత