Site icon HashtagU Telugu

ED On Raut: సంజయ్‌ రౌత్‌ ఇంట్లో ఈడీ సోదాలు

Sanjay Imresizer

Sanjay Imresizer

శివసేన సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. పాత్రా చౌల్‌ కేసులో ఆధారాల కోసం ముంబైలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్‌కు సంబంధించి సంజయ్‌రౌత్‌ను విచారించే అవకాశం ఉందని ఈడీ వర్గాలు వెల్లడించాయి.

కాగా, మనీలాండరింగ్‌ వ్యవహారంలో విచారణకు హాజరుకావాల్సిందిగా సంజయ్‌కి ఈడీ ఇప్పటికే నోటీసులు జారీచేసింది. ఈనెల 20న ఈడీ కార్యాలయానికి రావాలని తెలిపింది. అయితే పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో తాను ఆగస్టు 7న వస్తానని సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులే ఇవాళ ఆయన ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన పత్రాచల్‌ భూకుంభకోణం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఎంపీ సంజయ్ రౌత్ పై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలోనే ఈడీ అధికారులు ఇవాళ రౌత్ ఇంట్లో సోదాలు చేపట్టారు. నోటీసులకు ఎంపీ స్పందించని కారణంగా, ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఇవాళ నేరుగా ఇంటికెళ్లి ఈడీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎంపీ సంజయ్ రౌత్ ఇంటి వద్ద భారీ సంఖ్యలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు మోహరింపజేశారు. ఈడీ సోదాల సమయంలో ఎంపీ రౌత్ ఇంట్లోనే ఉన్నారని, ఆయనను అధికారులు ప్రశ్నించినట్లూ తెలుస్తోంది. ఈడీ తనిఖీలను నిరసిస్తూ శివసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈడీ సోదాలపై ట్వీట్టర్‌ వేదికగా సంజయ్‌ రౌత్‌ స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. మరోవైపు సంజయ్ రౌత్ ఆరోపణలను మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే కొట్టిపారేశారు. తప్పు చేయనప్పుడు సంజయ్ రౌత్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

Exit mobile version