Site icon HashtagU Telugu

ED Raids : ఆప్‌ మాజీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ ఇంట్లో ఈడీ సోదాలు

ED searches former AAP minister Saurabh Bharadwaj's house

ED searches former AAP minister Saurabh Bharadwaj's house

ED Raids : ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇంటిపై ఈ రోజు Enforcement Directorate (ఈడీ) అధికారులు త‌నిఖీలు నిర్వహించారు. ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన పని చేసిన కాలంలో హాస్పిటల్స్ నిర్మాణాలకు సంబంధించిన భారీ మోసాలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. దేశ రాజధాని ప్రాంతంలోని కనీసం 12 చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ కేసు 2018-19 మధ్య కాలంలో ప్రారంభమైన ఆస్పత్రుల నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించినదిగా తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అప్పట్లో సుమారు ₹5,590 కోట్లతో 24 కొత్త ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా ఐసీయూ ఆధారిత హాస్పిటల్స్‌ను కేవలం ఆరు నెలల్లో పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రాజెక్ట్‌ను ఆమోదించారు. కానీ మూడేళ్లు గడిచినా ఇప్పటివరకు ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఇప్పటి వరకూ రూ.800 కోట్లు ఖర్చయినా, కేవలం 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయనేది నివేదిక.

Read Also: Udayagiri & Himagiri : నేడు నావికాదళంలోకి ఉదయగిరి, హిమగిరి ఎంట్రీ

ప్రత్యేకంగా ఎల్ఎన్జేపీ ఆస్పత్రి నిర్మాణంలో భారీగా ఖర్చు పెరిగినట్టు గుర్తించారు. ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్‌కు రూ.488 కోట్లు అంచనా వేసినా, తర్వాత అది రూ.1,135 కోట్లకు చేరింది. అనేక నిర్మాణాల్లో సరైన అనుమతులు లేకుండా పనులు మొదలుపెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిలో కాంట్రాక్టర్లు కూడా కీలక పాత్ర పోషించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవి అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇక, హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (HIMS) ప్రాజెక్టు కూడా 2016 నుంచే పెండింగ్‌లో ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆస్పత్రుల నిర్వహణను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఎటువంటి పురోగతీ కనిపించలేదు. ఫండ్స్ మంజూరైనప్పటికీ ఆ వ్యవస్థ అమలులోకి రాకపోవడంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ కేసులో సౌరభ్ భరద్వాజ్‌ మాత్రమే కాకుండా, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ను కూడా ఈడీ విచారిస్తున్నది. గతంలో జైన్‌పై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన హాస్పిటల్స్ నిర్మాణ స్కాంలో ఆయన పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈడీ సోదాలు ఇంకా కొనసాగుతుండగా, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఇక ఆప్‌ నేతలు దీనిని రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణిస్తున్నారు. అధికార దుర్వినియోగం, ప్రజా ధన వ్యయం వంటి అంశాల్లో నిజమెన్ని, అవాస్తవమెన్ని అన్నది దర్యాప్తు అనంతరమే తెలుస్తుంది.

Read Also: Jubilee Hills Bypolls : జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్.. 30న సభ