18 Cr Cash ED: కోల్​కతాలో ఈడీ రైడ్స్..గేమింగ్ యాప్ నిర్వాహకుడి నివాసాల్లో 18 కోట్లు సీజ్

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్​కతాలో ఈడీ రైడ్స్ కొన సాగుతున్నాయి.

  • Written By:
  • Publish Date - September 10, 2022 / 11:22 PM IST

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్​కతాలో ఈడీ రైడ్స్ కొన సాగుతున్నాయి. మోసపూరిత మొబైల్ గేమింగ్​ యాప్​ “ఈ-నగ్గెట్స్​” ద్వారా ఎంతోమంది నుంచి డబ్బులు వసూలు చేసి కుచ్చుటోపీ పెట్టిన వ్యక్తి పై ఈడీ కొరడా ఝుళిపించింది. “ఈ-నగ్గెట్స్​” యాప్ ప్రమోటర్ కు చెందిన కోల్ కతాలోని 6 ప్రదేశాల్లో శనివారం రైడ్స్ చేసి దాదాపు రూ.18 కోట్లు స్వాధీనం చేసుకుంది. ఈ డబ్బులను లెక్క పెట్టడానికి ఈడీ అధికారులు 8 క్యాష్ కౌంటింగ్ మెషీన్స్ వాడారు.

ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) ప్రకారం ఈ రైడ్స్ చేసినట్లు ఈడీ తెలిపింది. ఫెడరల్ బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు .. “ఈ-నగ్గెట్స్​” యాప్ ప్రమోటర్ అమీర్ ఖాన్ సహా పలువురిపై కోల్ కతాలోని పార్క్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అమీర్ ఖాన్ “ఈ-నగ్గెట్స్​” మొబైల్ గేమింగ్ యాప్ ను లాంచ్ చేసిన కొత్తలో అట్రాక్టివ్ ఆఫర్స్ పెట్టాడు. మొబైల్ గేమ్స్ ఆడేందుకు, వాటి ప్యాకేజి కొనేందుకు కొంతమేర చార్జీలు వసూలు చేశాడు. యాప్ లోని వ్యలెట్ లో డబ్బులు లోడ్ చేసుకునే వాళ్లకు తొలినాళ్లలో రివార్డ్స్, కమిషన్ ఇచ్చేవారు. దీంతో ఎంతోమంది “ఈ-నగ్గెట్స్​”యాప్ వ్యలెట్ లో డబ్బులు పెద్దఎత్తున లోడ్ చేసుకున్నారు.

ఇలా పెద్ద ఎత్తున వ్యలెట్ లోకి గేమర్స్ డబ్బును లోడ్ చేసిన తర్వాత .. సడెన్ గా యాప్ ను ఆపేశారు. డబ్బులు విత్ డ్రా చేసే ఆప్షన్ తీసేశారు. దీంతో యాప్ యూజర్లు ఆందోళనకు దిగారు.చివరకు విషయం ఈడీ దాకా వెళ్ళింది. దీంతో ఈ ఈడీ రైడ్స్ జరిగాయి. దీనికి రాజకీయాలతో సంబంధమే లేదు. అయినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇలాంటి వ్యాపారవేత్తలకు తృణమూల్ కాంగ్రెస్ కొమ్ముకాస్తోందని బీజేపీ అంటోంది. ఈడీతో చిన్నాచితక బెంగాల్ వ్యాపారులను బీజేపీ బెదిరిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ చెబుతోంది.

2021 ఫిబ్రవరిలో ఫిర్యాదు..

ఈ-నగ్గెట్స్​ యాప్​ సహా ఆ కంపెనీ ప్రమోటర్​పై 2021 ఫిబ్రవరిలో కోల్​కతా పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. ఆ కేసు ఆధారంగా మనీలాండరింగ్​ కోణంలో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​ దర్యాప్తు ప్రారంభించింది. ఇటీవల అందిన సమాచారం ఆధారంగా శనివారం విస్తృత సోదాలు చేపట్టి, భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకుంది.ఆన్​లైన్​లో సులువుగా రుణాలు ఇచ్చి, అధిక వడ్డీలతో వేధించి.. అనేక మంది ఆత్మహత్యలు చేసుకునేందుకు కారణమైన చైనీస్ లోన్ యాప్స్​కు, ఈ-నగ్గెట్స్​ మొబైల్ గేమింగ్ యాప్​కు సంబంధం ఉందా అనే కోణంలోనూ ఈడీ దర్యాప్తు సాగిస్తోంది.