ED Office Fire: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అంటే ఎంతోమందికి దడ. ఆర్థిక అక్రమాలకు పాల్పడిన వాళ్ల గుండెల్లో ఈడీ పేరు వినగానే రైళ్లు పరుగెడుతాయి. అలాంటి ఈడీ ఆఫీసు భవన సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఏకంగా రెండుసార్లు ఈ భవనంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ అలుముకుంది. దీంతో కీలకమైన కేసులకు సంబంధించిన ఫైళ్లు కాలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన ఈడీ కార్యాలయం ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ ఏరియా కరీం భాయ్ రోడ్‌లో ఉన్న ఖైసర్ ఏ హింద్ బిల్డింగ్‌లో ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read :ED Inquiry : నేడు ఈడీ ఎదుట హాజరుకానున్న సూపర్ స్టార్ మహేష్ బాబు..?
తెల్లవారుజామున 2.30 నుంచి 7.30 వరకు..
ఈడీ ఆఫీసులో(ED Office Fire) మంటలు వ్యాపిస్తుండగా చూసిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అగ్నిమాపక విభాగానికి, పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పడం మొదలుపెట్టారు. అగ్నిప్రమాద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రమాదాన్ని లెవల్ 2గా ప్రకటించారు. కొంతమేర మంటలు అదుపులోకి వచ్చాక.. ఈ అగ్ని ప్రమాదాన్ని తెల్లవారుజామున 4.21 గంటలకు లెవెల్- 3గా అప్‌డేట్ చేశారు. ఇవాళ ఉదయం 7:30 గంటల వరకు ఈడీ ఆఫీసు మంటలను కంట్రోల్ చేస్తూనే ఉన్నారు.
Also Read :Pak Nationals: వామ్మో.. ఆ రాష్ట్రంలో ఐదువేల మంది పాకిస్థానీ పౌరులు
రంగంలోకి ఈడీ అధికారులు
ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఈడీ అధికారులు ఆఫీసు వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనలో పలు కీలక కేసులకు సంబంధించిన ఫైళ్లు, కంప్యూటర్లు కాలిపోయినట్లు గుర్తించారు. వాటి హార్డ్ డిస్క్‌లు సైతం దగ్ధమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాద నష్టం వివరాలతో త్వరలోనే ఈడీ అధికారులు నివేదికను విడుదల చేయనున్నారు. ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగింది ? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.