Site icon HashtagU Telugu

ED Vs Kejriwal : నాలుగోసారి కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు.. విచారణ తేదీ ఎప్పుడంటే ?

Arvind Kejriwal

Arvind Kejriwal Vs Ed

ED Vs Kejriwal : ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ (ఈడీ) మరోసారి యాక్షన్ మొదలుపెట్టింది. ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్​, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ (ఈడీ) నాలుగోసారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్‌ వ్యవహారంలో జనవరి 18న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేజ్రీవాల్‌కు ఇప్పటికే మూడుసార్లు సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో తమ ఎదుట హాజరు కావాలని దర్యాప్తు సంస్థ నాలుగోసారి ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు జనవరి 3న మూడోసారి ఈడీ సమన్లు జారీ చేయడంపై కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. ‘‘ఈడీ సమన్లు చట్టవిరుద్ధమైనవి. రాజకీయ ప్రేరేపితమైనవి. అవి అక్రమమైనవి. బీజేపీ సూచన మేరకే వాటిని పంపారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నన్ను దూరం చేసేందుకే ఈ సమన్లను జారీ చేశారు. తక్షణమే సమన్లను ఉపసంహరించుకోవాలి’ అని కేజ్రీవాల్(ED Vs Kejriwal) వ్యాఖ్యానించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ  అరెస్టు చేస్తుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఈడీ ఇటీవల కొట్టిపారేసింది. అవన్నీ వట్టి వదంతులేనని ఈడీ వర్గాలు స్పష్టం చేశాయి. కేజ్రీవాల్‌ ఇంటిపై దాడులు చేయాలనే..  సోదాలు నిర్వహించాలనే ప్లాన్‌ ఏమీ లేదని వెల్లడించాయి. గతవారం కేజ్రీవాల్‌ ఇంటిపై ఈడీ దాడులు చేయనుందని, అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుంటారని మంత్రులు అతిశి, సౌరభ్‌ భరద్వాజ్‌తో పాటు ఆప్‌ నేతలు ఎక్స్‌ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈడీ వర్గాల నుంచి తమకు సమాచారం ఉందని వరుస ట్వీట్లు చేశారు.

Also Read: Tigers Killing : పులులను చంపిన వారిలో మైనర్ బాలుడు.. ముగ్గురి అరెస్ట్

పంజాబ్‌ సహా ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయాలన్న వైఖరికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కట్టుబడి ఉందని, ఇప్పటివరకు జరిగిన చర్చలు సానుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ ఇటీవల తెలిపారు. ఆప్, కాంగ్రెస్ ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లో భాగంగా ఉన్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై రెండు పార్టీలు చర్చలు జరిపాయి. రెండు పార్టీల మధ్య సీట్ల పంపకంపై చర్చలు ప్రారంభమయ్యాయని.. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, గోవా, గుజరాత్‌లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయాలన్న వైఖరికి తమ పార్టీ కట్టుబడి ఉందని గోపాల్ రాయ్ తెలిపాయి. ఆప్ పోటీ చేసే సీట్ల గురించి ప్రశ్నించగా ఈ రాష్ట్రాలలో నిర్దిష్టంగా ఏయే సీట్లలో పోటీచేయాలన్న దానిపై చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్ అధికారంలో ఉంది. అయితే ఈ రెండు రాష్ట్రాలలో ఆప్‌తో ఎన్నికల పొత్తును కాంగ్రెస్ రాష్ట్ర శాఖలు వ్యతిరేకిస్తున్నాయి.