George Soros Vs ED : జార్జ్ సోరోస్.. అమెరికాలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ (ఓఎస్ఎఫ్) పేరుతో ఈయన ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతుంటారు. సోరోస్ ఎకానమిక్ డెవలప్‌మెంట్ ఫండ్ (SEDF) కూడా జార్జ్ సోరోస్‌దే. ఈ సంస్థలు భారత్‌లోని పలు సంస్థలకు విరాళాలను అందించాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఓఎస్ఎఫ్, SEDFలతో లింకులు ఉన్న, విరాళాలు పొందిన పలు భారత సంస్థలపై ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ విభాగం రైడ్స్ చేసింది.
‘అస్పద’ ఆఫీసుపై రైడ్
జార్జ్ సోరోస్ సంస్థల నుంచి విరాళాలను పొందే క్రమంలో పలు భారత సంస్థలు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు ఈడీ భావిస్తోంది. ఈ వివరాలను సేకరించేందుకు ఇవాళ బెంగళూరులోని ఆయా సంస్థల కార్యాలయాల్లో సోదాలు చేసింది. అస్పద ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Aspada Investments Private Limited) సంస్థ కార్యాలయంలోనూ ఈడీ రైడ్ జరిగింది. అస్పద ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది సోరోస్ ఎకానమిక్ డెవలప్‌మెంట్ ఫండ్ (SEDF)కు భారత్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌గా పనిచేస్తోంది. మారిషస్ కేంద్రంగా పనిచేసే ఒక కంపెనీకి అనుబంధ సంస్థగా అస్పద ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందని ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈ తనిఖీలపై జార్జ్ సోరోస్ సంస్థలు ఇప్పటివరకు స్పందించలేదు.
Also Read :Jinping Vs Army : జిన్‌పింగ్‌పై తిరుగుబాటుకు యత్నించారా ? కీలక ఆర్మీ అధికారులు అరెస్ట్
జార్జ్ సోరోస్ సేవలు.. బీజేపీ ఆరోపణలు
జార్జ్ సోరోస్(George Soros Vs ED) వయసు 92 ఏళ్లు. ఈయన ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ ద్వారా మానవ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతున్నట్లు చెబుతుంటారు. భారతదేశంలో 1999 సంవత్సరం నుంచి సోరోస్ సంస్థలు కార్యలాపాలు కొనసాగిస్తున్నాయి. భారత్‌లోని ప్రముఖ ఉన్నత విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను, రీసెర్చ్‌ను చేయాలని భావించే విద్యార్థులకు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ ఫెలోషిప్‌లు, స్కాలర్‌షిప్‌లను ఇస్తుంటాయి. అయితే జార్జ్ సోరోస్ సంస్థలు భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, వాటి వల్ల భారత ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని అధికార బీజేపీ ఆరోపిస్తోంది. సోరోస్‌పై గతంలో దిగ్గజ బీజేపీ నేతలు కూడా ఆరోపణలు చేశారు.