Site icon HashtagU Telugu

Delhi Liquor Case: ఈడీ దూకుడు.. గోవా డొంక కదులుతుంది

Delhi Liquor Case

Delhi Liquor Case

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ మరింత దూకుడు పెంచింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఈడీ అధికారులు కేసును సుమోటుగా తీసుకుని విచారిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తాజాగా మరో కీలక నేత అరెస్ట్ అయ్యాడు. చన్‌ప్రీత్ సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం అరెస్టు చేసింది. గోవా ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఫండ్స్ మేనేజ్ చేసినట్లు చన్‌ప్రీత్ సింగ్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈడీ మరింత సమాచారం రాబట్టేందుకు చన్‌ప్రీత్ సింగ్‌ను అదుపులోకి తీసుకుంది.

మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌ను కూడా దర్యాప్తు సంస్థ విచారించింది.ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు 17 మందిని అరెస్ట్ చేసింది. గతంలో ఇదే కేసులో చన్‌ప్రీత్ సింగ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్‌ఐఆర్ తర్వాత మనీలాండరింగ్ కేసు వెలుగులోకి వచ్చింది.

We’re now on WhatsAppClick to Join

గోవాలో 2022 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న సర్వే సంస్థలు, ఏరియా మేనేజర్లు, అసెంబ్లీ మేనేజర్లు మరియు ఇతరులకు చన్‌ప్రీత్ సింగ్ నగదు చెల్లింపులు చేశారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఢిల్లీ మద్యం మార్కెట్‌లో ఆధిపత్య స్థానం సంపాదించేందుకు సౌత్ గ్రూప్ ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు లంచం ఇచ్చిందని ఈడీ ఆరోపించింది. కాగా లిక్కర్ పాలసీ 2021-22 ఇప్పుడు రద్దైన విషయం తెలిసిందే. సౌత్ గ్రూపులో బీఆర్ఎస్ నేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కే కవిత, వ్యాపారవేత్త శరత్ చంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ లంచాల్లో రూ. 45 కోట్లను ఆప్ తన గోవా ఎన్నికల ప్రచారానికి ఆర్థికంగా వినియోగించిందని ఈడీ ఆరోపిస్తుంది.కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Also Read: Wine Shops Close : మందు బాబులకు ముఖ్య గమనిక..