Economic Survey 2024 : ఈరోజు నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే- 2024ను పార్లమెంటుకు సమర్పిస్తారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు ఆర్థిక సర్వే నివేదికను(Economic Survey 2024) పార్లమెంటుకు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. తొలిసారిగా ఆర్థిక సర్వేను 1950- 51లో మన దేశ పార్లమెంటులో ఆవిష్కరించారు.ఇవాళ పార్లమెంటులో ఆర్థిక సర్వే నివేదికను ప్రవేశపెట్టిన తర్వాత.. దేశ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడిస్తారు.
We’re now on WhatsApp. Click to Join
ఆర్థిక మంత్రి నిర్మల రేపు(మంగళవారం) ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను(Union Budget 2024) ప్రవేశపెట్టనున్నారు. దీంతో వరుసగా ఏడుసార్లు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన ఘనత ఆమె సొంతం అవుతుంది. 2019 సంవత్సరం నుంచి ఆమెనే బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. దేశంలో అత్యధికంగా పదిసార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా మొరార్జీ దేశాయ్ తిరుగులేని రికార్డును నెలకొల్పారు. పి.చిదంబరం తొమ్మిదిసార్లు, ప్రణబ్ ముఖర్జీ ఎనిమిదిసార్లు; సీడీ దేశ్‌ముఖ్, యశ్వంత్ సిన్హా చెరో ఏడుసార్లు; మన్మోహన్ సింగ్, వైబీ చవాన్, అరుణ్ జైట్లీ చెరో ఐదుసార్లు; టీటీ కృష్ణమాచారి నాలుగుసార్లు; ఆర్.వెంకట్రామన్, హెచ్‌ఎం పటేల్ చెరో మూడుసార్లు; సి.సుబ్రమణ్యం, వీపీ సింగ్, జశ్వంత్ సింగ్, ఆర్‌కే షణ్ముఖం శెట్టి, జాన్ మథాయ్ రెండుసార్లు చొప్పున బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి హోదాలో ఉన్న సమయంలో స్వయంగా జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ ఒక్కోసారి బడ్జెట్ సమర్పించారు.
Also Read :Biden : ఎన్నికల రేసు నుంచి బైడెన్ ఔట్.. బరిలోకి కమలా హ్యారిస్ ?
ఆర్థిక సర్వే అంటే ?
- గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పనిచేసింది అనే విషయాలను పార్లమెంటుకు, దేశానికి తెలియజేసేదే ఆర్థిక సర్వే.
- ఈసారి విడుదల చేయనున్న ఆర్థిక సర్వే 2024 నివేదికలో 2023-24 ఆర్థిక సంవత్సంలో మన దేశ ఆర్థిక స్థితి ఎలా ఉందనే వివరాలు ఉంటాయి.
- ఆర్థిక సర్వే నివేదికను కేంద్ర ఆర్థికశాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఎకనామిక్స్ డివిజన్ తయారు చేస్తాయి.
- దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు ఆధ్వర్యంలో ఆర్థిక సర్వే నివేదికను రెడీ చేస్తారు.
- గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికాభివృద్ధి, జీడీపీ ఎలా ఉందనేది ఈ నివేదికలో తెలిసిపోతుంది.
- రాబోయే ఏడాది పరిస్థితులు ఎలా ఉండొచ్చు అనేది కూడా ఆర్థిక సర్వే అంచనా వేస్తుంది.
- ఈసారి కొత్త బడ్జెట్‌లో కేటాయింపులను సైతం ఆర్థిక సర్వే నివేదికకు అనుగుణంగానే చేస్తారు.
- ఆర్థిక సర్వే నివేదిక తొలి భాగంలో ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల వివరాలు ఉంటాయి. రెండోభాగంలో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించినరివ్యూ ఉంటుంది.