ECI – Derogatory Words : పొలిటికల్ లీడర్స్.. ప్రసంగాల్లో అలాంటి భాషను వాడొద్దు : ఈసీ

ECI - Derogatory Words : కొందరు రాజకీయ పార్టీల నేతలు ప్రసంగాల్లో  ఎలాంటి పదాలను ఉపయోగిస్తారో ప్రత్యేకంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు.

Published By: HashtagU Telugu Desk
Election Commission

Election Commission

ECI – Derogatory Words : కొందరు రాజకీయ పార్టీల నేతలు ప్రసంగాల్లో  ఎలాంటి పదాలను ఉపయోగిస్తారో ప్రత్యేకంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటిని వినీవినీ మనం చెవులు అరిగిపోయాయి.  విమర్శలు, ప్రతి విమర్శల పేరిట నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. అలాంటి నోటి దురుసు కలిగిన రాజకీయ నేతలకు కొంతమేర కళ్లెం వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కీలక సూచనలు చేసింది.  రాజకీయ నేతలు తమ ఉపన్యాసాల్లో దివ్యాంగుల వైకల్యాన్ని తెలిపే పదాలను సాధ్యమైనంత వరకూ ఉపయోగించకూడదని నిర్దేశించింది. మూగ, పాగల్‌, సిర్ఫిరా, అంధ, గుడ్డి, చెవిటి, కుంటి వంటి పదాలను(ECI – Derogatory Words) రాజకీయ నాయకులు వాడకుండా ఉండాలని తెలిపింది. రాజకీయ ప్రసంగాల్లో ఇలాంటి పదాలను నిషేధించాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఇలాంటి పదాలను నాయకులు వాడకుండా నిరోధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని, పార్టీలన్నీ తమతమ నేతలకు దీనిపై మార్గదర్శకాలు జారీ చేయాలని కోరింది. రాజకీయ ప్రసంగాల్లో దివ్యాంగులకు సంబంధించిన పదాలను దూషించడానికి వాడుకోకూడదని హితవు పలికింది.

We’re now on WhatsApp. Click to Join.

రాజకీయ నేతల ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్ట్‌లు, ప్రకటనలు, పత్రికా ప్రకటనలతో సహా అన్నిచోట్లా దివ్యాంగులకు సంబంధించిన పదాలను దూషణల కోసం వాడకుండా నిరోధించడానికి రాజకీయ పార్టీలు అంతర్గత సమీక్షను నిర్వహించుకోవాలని ఈసీ కోరింది. తమ నాయకులు వైకల్యపరమైన, లింగపరమైన  సున్నిత భాషను మాత్రమే ఉపయోగిస్తారని వెల్లడిస్తూ అన్ని రాజకీయ పార్టీలు తమతమ వెబ్‌సైట్లలో ప్రకటన చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దివ్యాంగులను గౌరవిస్తున్నట్లు అధికారిక వెబ్‌సైట్‌లలో ప్రత్యేక ప్రచురణ చేయాలని పేర్కొంది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే వికలాంగుల హక్కుల చట్టం- 2016లోని సెక్షన్ 92 ప్రకారం ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

Also Read: 3 Years Prison : విద్యాశాఖ మంత్రి, ఆయన భార్యకు మూడేళ్ల జైలుశిక్ష

పార్టీల కార్యకర్తలకు, నేతలకు దీనిపై శిక్షణా మాడ్యూళ్లను అందించాలని ఈసీ తెలిపింది. నాయకులు ఎవరైనా దివ్యాంగులకు సంబంధించిన పదాలతో దూషణకు దిగిన సందర్భాల్లో వికలాంగుల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి సదరు నేతలకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు పార్టీలు అంతర్గతంగా నోడల్ అథారిటీని ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది.

  Last Updated: 21 Dec 2023, 03:26 PM IST