Earthquake : మనదేశంలో మరో భూకంపం సంభవించింది. తాజాగా ఇవాళ తెల్లవారుజామున అసోం రాష్ట్రం పరిధిలో పలుచోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. గువహటి నగరంలోనూ ప్రజలు భూప్రకంపనలను ఫీలయ్యారు. జనం భయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. చాలాసేపు రోడ్లపైనే గడిపారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైంది. ఈవివరాలను నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించింది. అసోంలోని మోరిగావ్ ప్రాంతంలో గురువారం ఉదయం 2.25 గంటలకు భూమి(Earthquake) కంపించిందని పేర్కొంది. భూకంప కేంద్రంలో భూమికి 16 కిలోమీటర్ల లోతులో భూకంపం చోటు చేసుకుందని తెలిపింది. దీంతో ఏం జరుగుతుందోనని ఆయా ప్రాంత ప్రజలు ఆందోళనకు లోనయ్యారు. ఈ భూకంపం ప్రభావం భారత్ పొరుగున ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్, చైనాలలోని సరిహద్దు ప్రాంతాలను కూడా తాకింది. అయితే అక్కడ ఎలాంటి ప్రభావం పడిందనే సమాచారం తెలియరాలేదు.
Also Read :Telangana State Bird: మిషన్ పాలపిట్ట.. రంగంలోకి తెలంగాణ సర్కార్
రిక్టర్ స్కేలుపై 5 తీవ్రత అంటే .. ?
రిక్టర్ స్కేలుపై 5 తీవ్రతతో చోటుచేసుకునే భూకంపాన్ని ‘మోస్తరు’ స్థాయి కలిగినదిగా వర్గీకరిస్తారు. దీనివల్ల భూకంప కేంద్రం పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నష్టం జరుగుతుంది. భవనాలకు పగుళ్లు రావడం, వస్తువులు కిందపడటం, నిర్మాణాలకు స్వల్ప నష్టం, బలహీనంగా నిర్మించిన భవనాలకు నష్టం వంటివి జరుగుతాయి. భారీ నష్టమేం జరగదు. అసోంలో భూకంపాలు రావడం అనేది కామన్ విషయం. అత్యంత ప్రమాదకర భూకంప జోన్ ‘సీస్మిక్ 5’లో ఉన్న రాష్ట్రం అసోం. భారీ భూకంపాలు వచ్చే ముప్పు ఉన్న ప్రాంతాలను ‘సీస్మిక్ 5’ జోన్‌లో చేరుస్తారు. మన దేశంలోని కేవలం 11 శాతం ప్రాంతం మాత్రమే ‘సీస్మిక్ 5’ జోన్‌లో ఉంది. జపాన్ లాంటి దేశాల్లోనైతే ఇలాంటి హైరిస్క్ జోన్లు ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి.
Also Read :MLA Quota MLCs: మజ్లిస్, సీపీఐకు చెరొకటి.. 2 ఎమ్మెల్సీ సీట్లలో కాంగ్రెస్ లెక్కలివీ
ఇటీవలే చోటుచేసుకున్న భూకంపాలు..
మరో ఈశాన్య రాష్ట్రం మేఘాలయలోని పశ్చిమ ఖాసీ హిల్స్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు భూకంపం వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి టైంలో భారత్ పొరుగునే ఉన్న మయన్మార్‌లో కూడా ఎర్త్ క్వేక్ వచ్చింది. ఫిబ్రవరి 17న తెల్లవారుజామున మన దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం వచ్చింది. మొత్తం మీద గత కొన్ని నెలలుగా భూకంపాలు మన దేశంలో పెరిగిపోయాయి.