Drugs Smuggling: పుష్ప సినిమాను తలపించే సీన్.. పెళ్లి వస్త్రాల చాటున డ్రగ్స్ స్మగ్లింగ్.. చివరికి ఎలా దొరికారంటే..

పుష్ప సినిమా స్టైల్లో డ్రగ్స్ ని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు

  • Written By:
  • Publish Date - December 12, 2022 / 08:32 PM IST

Drugs Smuggling: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప సినిమాను ఎర్రచందనం స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇందులో ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం అల్లు అర్జున్ వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటాడు. పోలీసులకు చిక్కకుండా కొత్త కొత్త ఐడియాలు వేస్తూ ఉంటాడు. అల్లు అర్జున్ టెక్నిక్‌లను పోలీసులు కూడా గుర్తించలేరు. అలా పోలీసులకు కూడా చిక్కకుండా అల్లు అర్జున్ లారీలలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు పుష్ప సినిమా తరహాలో చేసి ఓ గ్యాంగ్ డ్రగ్స్ తరలించాలని చూసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.

వస్త్రాల మాటున డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చెన్నైకి చెందిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి వస్త్రాల బాక్సుల్లో డ్రగ్స్ తరలిస్తుండగా పట్టుబడ్డారు. రాంరాజ్ ధోతి కోసం కాటన్ బాక్స్‌లో డ్రగ్స్ దాచి పెళ్లి వస్త్రాల మాటున వివిధ ప్రాంతాలు తరలిస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషన్ మహేష్ భగవత్ స్పష్టం చేశారు.

చెన్నై నుంచి హైదరాబాద్, పుణెకు తరలిస్తున్నారని, అక్కడ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించినట్లు మహేష్ భగవత్ తెలిపారు. సూడో ఎఫిడ్రీన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని, నిందితుల దగ్గర ఫేక్ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు గుర్తించినట్లు తెలిపారు. లుంగీలు, ఫ్యాన్సీ ఐటమ్ బాక్సుల్లో ప్యాక్ చేసి కొరియర్ ద్వారా బస్సుల్లో తరలిస్తున్నట్లు చెప్పారు. ఎవరికీ అనుమానం లేకుండా ఉండేందుకు పెళ్లి వస్త్రాల చాటున డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు.

ఇద్దరిని అరెస్ట్ చేసి 8.5 కిలోల సూడో ఎఫిడ్రైన్ స్వాధీనం చేసుకున్నట్లు మహేష్ భగవత్ తెలిపారు. వీటి విలువ రూ.9 కోట్లుగా ఉందని తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితుల పేర్లు మహమ్మద్ ఖాసీం, రసులుద్దీన్ లుగా గుర్తించినట్లు తెలిపారు, ఇప్పటివరకు పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను విదేశాలకు తరలించారని, చాలాకాలంగా ఇది నడుస్తుందని తెలిపారు. డ్రగ్స్ ను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు.