Drones : సరిహద్దుల్లో డ్రోన్ల కలకలం.. బాంబులకు టైమ్ సెట్ చేసి పేల్చడానికి కుట్ర

పాకిస్తాన్ ఎన్నిసార్లు మన చేతిలో దెబ్బతిన్నా దానికి బుద్ధి రావడం లేదు. అందుకే పదే పదే మనపై దాడికి వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తోంది.

  • Written By:
  • Publish Date - June 7, 2022 / 05:00 PM IST

పాకిస్తాన్ ఎన్నిసార్లు మన చేతిలో దెబ్బతిన్నా దానికి బుద్ధి రావడం లేదు. అందుకే పదే పదే మనపై దాడికి వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తోంది. ఆకాశమార్గంలో డ్రోన్ల ద్వారా మన దేశంలోకి పేలుడు పదార్థాలను సరఫరా చేయడానికి అది చాలా ప్రయత్నించింది. కానీ జమ్మూ పోలీసులు అలెర్ట్ గా ఉండడంతో అలాంటి ఓ డ్రోన్ ను సరిహద్దుల్లోనే గుర్తించగలిగారు. దానిపై కాల్పులు జరిపారు. ఆ డ్రోన్ నుంచి మూడు మ్యాగ్నెటిక్ ఐఈడీ బాంబులు జారిపడ్డాయి.

అఖ్నూర్ సెక్టార్ లో దేశ సరిహద్దుల్లో సోమవారం రాత్రి ఓ డ్రోన్ తిరుగుతుండగా భద్రతాదళాల కంటపడింది. దీంతో దానిపై కాల్పులు జరిపారు. ఆ వెనువెంటనే పోలీస్ పార్టీ ద్వారా అక్కడ యాంటీ డ్రోన్ వ్యవస్థను ఉపయోగించారు. తరువాత రాత్రి 11 గంటల సమయంలో కనచక్ లో మరోసారి డ్రోన్ ను గుర్తించారు. వెంటనే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది దానిపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో దానిపైనుంచి పేలోడ్ కిందపడింది. కానీ డ్రోన్ మాత్రం చిక్కలేదు.

ఆ పేలోడ్ లో ఓ టిఫిన్ బాక్స్ ఉంది. అందులో మూడు మ్యాగ్నెటిక్ ఐఈడీలు ఉన్నాయి. వాటికి టైమ్ కూడా సెట్ చేశారు. అంటే వాళ్లు టార్గెట్ పెట్టిన ప్రదేశంలో ఈ బాంబులను జారవిడిచి అనుకున్న సమయానికి అవి పేలేలా ఉగ్రవాదులు ఈ టెక్నాలజీని ఉపయోగించుకున్నారని అర్థమవుతోంది. కానీ భద్రతాదళాలు ఈ బాంబులను నిర్వీర్యం చేశాయి. ఈ డ్రోన్ వ్యవహారంపై ఇప్పటికే కేసును నమోదు చేశారు.

కిందటి నెలాఖరులో కూడా కథువా ప్రాంతంలోని తాల్లీ హరియాచాక్ దగ్గర కూడా ఓ క్వాడ్ కాప్టర్ కనిపించింది. దీంతో ఉలిక్కిపడ్డ జమ్ముకశ్మీర్ పోలీసులు దానిని వెంటనే కూల్చేశారు. అందులో ఏడు మ్యాగ్నెటిక్ బాంబులతోపాటు ఏడు యూజీబీఎల్ గ్రనేడ్లు కూడా ఉన్నాయి. దీంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అమరనాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు కొంతకాలంగా ఇలాంటి దారుణాలకు స్కెచ్ వేస్తున్నారు.