Vote Vs Eat : అమ్మానాన్న నాకు ఓటేయకుంటే అన్నం తినొద్దు.. స్కూల్ పిల్లలకు ఎమ్మెల్యే పాఠాలు

Vote Vs Eat : ‘‘మీ అమ్మానాన్న నాకు ఓటు వేయకపోతే.. రెండు రోజులు పాటు భోజనం మానేయండి’’ అని స్కూల్‌ పిల్లలకు ఒక ప్రజాప్రతినిధి నూరిపోశాడు.

  • Written By:
  • Updated On - February 11, 2024 / 01:33 PM IST

Vote Vs Eat : ‘‘మీ అమ్మానాన్న నాకు ఓటు వేయకపోతే.. రెండు రోజులు పాటు భోజనం మానేయండి’’ అని స్కూల్‌ పిల్లలకు ఒక ప్రజాప్రతినిధి నూరిపోశాడు. తన పేరును చిన్నారులతో పలుమార్లు చెప్పించుకోవడం ద్వారా తన పైత్యాన్ని ఆ ఎమ్మెల్యే అందరి ఎదుట చాటుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన ఆ ఎమ్మెల్యే  తీరుపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. సీఎం ఏక్‌నాథ్‌ షిండే శివసేన వర్గానికి చెందిన ఎమ్మెల్యే సంతోష్ బంగర్‌ ఈ విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది నవంబరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారం ప్రారంభించిన సంతోష్ బంగర్ ఓ స్కూలుకు వెళ్లిన సందర్భంలో పైవిధంగా తన పైత్యాన్ని(Vote Vs Eat) విద్యార్థుల ఎదుట ప్రదర్శించారు.

We’re now on WhatsApp. Click to Join

ఎమ్మెల్యే సంతోష్ బంగర్‌ తన నియోజకవర్గం కలమ్‌నూరి పరిధిలోని ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా స్కూల్‌ పిల్లలతో వింతగా ఆయన మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీ తల్లిదండ్రులు నాకు ఓటు వేయకపోతే రెండు రోజులు మీరు ఆహారం తీసుకోవద్దని పిల్లలను బంగర్‌ కోరారు. ‘మీరు ఎందుకు తినడం లేదని తల్లిదండ్రులు మిమ్మల్ని అడిగితే, ఆహారం తినే ముందు ‘సంతోష్ బంగర్’కు ఓటు వేయాలని చెప్పండి’ అని వారికి సూచించారు. స్కూల్‌ పిల్లలతో తన పేరును పలుమార్లు చెప్పించుకున్నారు.  ఇది చూసి ఆయన వెంట ఉన్న నాయకులతో పాటు టీచర్లు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  గతంలోనూ బంగర్ ఈవిధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాన మంత్రి కాకుంటే తాను నడిరోడ్డుపై ఉరేసుకుంటానని ప్రకటించారు.

Also Read : Video Viral : : అమ్మతో కలిసి శేఖర్ మాస్టర్ డాన్స్.. వీడియో వైరల్

ఎమ్మెల్యే సంతోష్ బంగర్ తీరుపై ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత విజయ్ వాడెట్టివార్ స్పందిస్తూ.. రాజకీయ ప్రచారానికి లేదా ఎన్నికల సంబంధిత పనులకు పిల్లలను వాడుకోవద్దని ఈసీ ఆదేశించినప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఇది పట్టడం లేదని విమర్శించారు. బాలకార్మికుల సవరణ చట్టం 2016 కింద ఉల్లంఘనే అవుతుందని, విద్యాశాఖ మంత్రి నిద్రపోతున్నారా? అని ఆయన ప్రశ్నించారు. అలాగే ఎమ్మెల్యే సంతోష్‌ బంగర్‌పై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తరుచూ బంగర్ ఇలాంటి తప్పులు చేస్తున్నా బీజేపీ కూటమి ఎమ్మెల్యే కావడంతో చూసీచూడకుండా వదిలేస్తున్నారని, ఈసీ పక్షపాతం లేకుండా చర్యలు తీసుకోవాలనీ ఎన్సీపీ (శరద్ పవార్) అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో కోరారు.