పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతున్నాయని, ఏడాది పాటు కొనుగోళ్లు ఆపేయాలని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని కోరారు. అయితే, ప్రధాని మోదీ సూచనతో దేశ ప్రజలు ఒక ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను ఆపేస్తే మన ఆర్థిక వ్యవస్థకు ఎలా మేలు చేస్తుంది? ప్రస్తుతం దేశంలో విదేశీ మారక నిల్వలు సమృద్ధిగానే ఉన్నప్పటికీ ఎందుకు అలా చెప్పారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కరోనా మహమ్మారి విజృంభన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులో సమస్యలు వచ్చాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వివిధ దేశాల మధ్య యుద్ధాలతో చమురు ధరలు భారీగా పెరిగాయని, బంగారం ధరలు పెరుగుతున్నాయని గుర్తు చేశారు. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను నిలిపివేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. బంగారం దిగుమతులు తగ్గితే విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుందని చెప్పారు. అయితే, ప్రధాని మోదీ సూచన మేరకు మనం ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయడం ఆపేస్తే దాని ద్వారా కేంద్రానికి వచ్చే లాభం ఏమిటి? ఆయన అలా ఎందుకు అన్నారు? ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి లాభం జరుగుతుంది? అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పెరుగుతున్న ఇంధన ధరలు, సరఫరా గొలుసులో అంతరాయాలు దిగుమతులపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇలాంటి తరుణంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రధాని మోదీ సూచనలో ఉన్న ముఖ్య ఉద్దేశం. మే 10వ తేదీ ఆదివారం రోజున హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రపంచ సంక్షోభం మధ్య సామూహిక ప్రజా భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలు వంటి అత్యవసరం కాని విదేశీ మారక ద్రవ్య లావాదేవీలను తగ్గించుకోవాలని కోరారు. వీలైనంత మేరకు విదేశీ మారక నిల్వలను పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను మానుకోవాలని కోరారు.
ఇంధన వినియోగాన్ని తగ్గించడం, ప్రజా రవాణాను ఉపయోగించడం, ఇంటి నుంచి పని చేసే విధానాలు, సహజ వ్యవసాయం, స్వదేశీ ఉత్పత్తులకు మద్దతు వంటి చర్యలతో పాటు ఆర్థిక దేశభక్తిని ప్రోత్సహించే విస్తృత ప్రయత్నంలో భాగంగా ప్రధాని మోదీ ఈ విజ్ఞప్తి చేసినట్లు స్పష్టమవుతోంది. ప్రపంచంలోనే బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. దేశీయ డిమాండ్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. బంగారం దిగుమతులకు డాలర్లలో చెల్లింపులు జరుగుతాయి. కాబట్టి భారీ ఎత్తున బంగారం కొనుగోలు చేయడంతో భారతదేశ దిగుమతుల బిల్లు, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. బంగారం వంటి విచక్షణతో కూడిన దిగుమతులను తగ్గించడం ద్వారా రూపాయిపై ఒత్తిడిని తగ్గించవచ్చు. దీంతో వాణిజ్య సమతుల్యత మెరుగవుతుంది. ప్రపంచం అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్న తరుణంలో విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ఇది సహాయపడుతుంది.
ప్రధాని మోదీ హెచ్చరికలు చేసినప్పటికీ, దేశంలో విదేశీ మారకం నిల్వలు ప్రస్తుతానికి సమృద్ధిగానే ఉన్నాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ బలమైన స్థితిలోనే ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా అర్ధ వార్షిక నిల్వల నిర్వహణ నివేదిక ప్రకారం 2026 మార్చి నాటికి భారత్‌లో ఫారెక్స్ రిజర్వ్స్ 691.11 బిలియన్ డాలర్లు ఉన్నాయి. దాదాపు 11 నెలల దిగుమతులకు ఈ నిల్వలు సరిపోతాయని అంచనా. మరోవైపు బంగారం కొనుగోళ్ల కోసం వెచ్చించే విదేశీ నిల్వల వాటా 16.7 శాతానికి పెరగడం గమనార్హం. ఇది 2025, సెప్టెంబర్‌లో 13.92 శాతంగా ఉండేది. బంగారం ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. భారత్ వద్ద ప్రస్తుతం 800.52 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల విలువ (బంగారం, ఆయిల్ వంటివి) మనం ఎగుమతి చేసే వస్తువుల విలువ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. పెట్రోలియం తర్వాత మన దేశం అత్యధికంగా ఖర్చు చేసేది బంగారంపైనే. బంగారం దిగుమతులు తగ్గితే ఈ లోటు తగ్గి ఆర్థిక వ్యవస్థ సమతుల్యంగా ఉంటుంది. రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో ఇతర కరెన్సీలతో పోలిస్తే స్థిరంగా ఉంటుంది.
బంగారాన్ని ఆర్థికవేత్తలు డెడ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా పిలుస్తారు. బంగారం బిస్కెట్లు లేదా నగలు కొనుగోలు చేసి లాకర్‌లో పెడితే అది కేవలం నీ దగ్గర మాత్రమే ఉంటుంది. అది దేశ ఉత్పత్తికి లేదా ఉద్యోగ కల్పనకు ఉపయోగపడదు. అదే బంగారం కొనుగోలు చేయకుండా ఆ డబ్బును బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టినప్పుడు ఆ డబ్బును బ్యాంకులు పరిశ్రమలకు అప్పుగా ఇస్తాయి. తద్వారా కొత్త ఫ్యాక్టరీలు వస్తాయి, ఉద్యోగాలు లభిస్తాయి.
దేశ ప్రజలు ఫిజికల్ గోల్డ్ కాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సావరీన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసినట్లయితే ప్రభుత్వానికి చాలా మేలు జరుగుతుంది. ప్రభుత్వానికి చాలా తక్కువ వడ్డీకే నిధులు సమకూరుతాయి. ఆ నిధులను రోడ్లు, రైల్వేలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఉపయోగిస్తుంది. బంగారం కొనుగోళ్లు తగ్గినప్పుడు ప్రజల వద్ద ఉన్న డబ్బు ఇతర రంగాలు అంటే రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, తయారీ రంగాలకు మళ్లుతుంది. దీనివల్ల దేశ జీడీపీ వృద్ధి చెందుతుంది. మనం బంగారం కొనుగోలు చేసిన ప్రతిసారీ మన ఖజానాలోని డాలర్లు విదేశాలకు వెళ్తాయి. దేశంలో సంపద సృష్టి జరగాలి కానీ అది కేవలం లాకర్లలో డెడ్ ఇన్వెస్ట్‌మెంట్గా ఉండిపోకూడదని ప్రధాని మోదీ ఉద్దేశం. బంగారం మీద మోజు తగ్గి ఆ పెట్టుబడులు మౌలిక సదుపాయాల మీదకు మళ్లితే దేశ జీడీపీ వేగంగా వృద్ధి చెందుతుంది. విదేశీ సంస్థల మీద ఆధారపడడం తగ్గుతుంది. దేశం కోసం ఏడాది పాటు బంగారం కొనకండి అనే పిలుపు వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ దేశంలోని సంపదను స్తబ్ధత నుంచి ఉత్పాదకత వైపు మళ్లించడమేనని చెప్పవచ్చు.
మన దేశంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు,పండగలు అంటే మొదటగా బంగారమే గుర్తుకు వస్తుంది. ఒక ఏడాది పాటు పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనుగోళ్లను ఆపడం అనేది చాలా కష్టం. సామాన్యుడికి బంగారం అంటే ఒక ఆపద్బాంధవుడు లాంటిది. కష్టమొస్తే తాకట్టు పెట్టుకోవడానికి పనికొచ్చే ఏకైక ఆస్తి. కొనుగోళ్లు ఆపితే లక్షలాది మంది స్వర్ణకారులు ఇబ్బంది పడవచ్చు. అయితే, ఫిజికల్ గోల్డ్ కాకుండా ప్రజలు డిజిటల్ గోల్డ్ లేదా సావరీన్ గోల్డ్ బాండ్ల వైపు మళ్లితే బంగారం కొన్నట్లే అవుతుంది. గతంలో యుద్ధాల సమయంలో ప్రజలు తమ బంగారాన్ని దేశం కోసం ఇచ్చిన చరిత్ర మనది. ఇప్పుడు ఆర్థిక యుద్ధం కోసం ఏడాది పాటు కొత్త బంగారం కొనకుండా ఉండడం అనేది దేశం పట్ల గౌరవాన్ని చూపే అవకాశం. అయితే, ఇవన్నీ ప్రాక్టికల్‌గా జరగడం కొంత మేర సాధ్యం కాకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
బంగారం కొనాలంటే డాలర్లలోనే చెల్లించాలి. మనం బంగారం భారీగా కొనుగోలు చేస్తే, విదేశాల నుంచి దిగుమతి చేసేందుకు ప్రభుత్వం మార్కెట్లో ఉన్న డాలర్లను భారీగా కొనుగోలు చేయాల్సి వస్తుంది. దేనికైనా సరే డిమాండ్ పెరిగితే దాని రేటు పెరుగుతుంది. ఈ లెక్కన డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి విలువ పడిపోతుంది. అదే మనం బంగారం కొనడం ఆపేస్తే డాలర్ల అవసరం తగ్గి రూపాయి తన విలువను నిలబెట్టుకుంటుంది.
