Site icon HashtagU Telugu

Dolo 650: ఏడాదిలో అమ్మిందే రూ. 350కోట్లు…డాక్టర్లకు వెయ్యి కోట్లు ఎలా ఖర్చు చేస్తాం..!!!

Dolo 650

Dolo 650

కోవిడ్ మహమ్మారి విజ్రుంభించిన సమయంలో వైరస్ బాధితులకు పారాసెటమాల్ డ్రగ్ డోలో 650 ట్యాబ్లెటును సిఫారసు చేసినందుకు వైద్యులకు దాదాపు వెయ్యి కోట్ల నజరానాగా ఇచ్చారన్న వార్తలపై డోలో కంపెనీ స్పందించింది. డోలో తయారుదారు మైక్రోల్యాబ్స్ లిమిటెడ్ కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ జయరాజ్ గోవిందరాజు ఈ ఆరోపణలను కొట్టిపారేశారు.

డోలో 650 ట్యాబ్లెట్ ను రాసేందుకు తయారీదారులు వైద్యులకు వెయ్యి కోట్ల తాయిలాలు ఇచ్చారని…దీనిపై చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జిస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం తీవ్రంగా పరిగణించాలని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో కేంద్రం తన స్పందనను పదిరోజుల్లోగా తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది.

కాగా ఈ విషయంపై జయరాజ్ గోవిందరాజు మాట్లాడారు. కరోనా సమయంలో డోలో 650 కోసం మేము వెయ్యి కోట్లు ఖర్చు చేశామనడంలో నిజం లేదు. ఎందుకంటే గతేడాదిలో అత్యధిక అమ్ముడైన ఈ బ్రాండ్ ద్వారా మాకు కేవలం 350కోట్లు వచ్చాయి. అలాంటిది దీని కోసం వెయ్యికోట్లు ఎలా ఖర్చుచేస్తామంటూ ప్రశ్నించారు. మేమే కాదు ఏ కంపెనీ కూడా బ్రాండ్ కోసం అంత భారీ మొత్తాన్ని ఖర్చు చేయదన్నారు. డోలో 650 తో పాటు అన్ని రకాల పారాసెటమాల్ ట్యాబ్లెట్ల ధరలు నియంత్రణలోనే ఉన్నాయన్నారు.

తమ కంపెనీపై ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ కాపీ తమకు అందలేదన్నారు. సుప్రీంకోర్టుల వ్యాజ్యం విషయంలో ఏదైనా వివరణ అడిగనట్లయితే ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.