Site icon HashtagU Telugu

Rahul Gandhi : మోడీ సర్కారు తప్పుడు విధానాల వల్లే ఉగ్రదాడులు : రాహుల్‌గాంధీ

Modi is planning to change the constitution: Rahul Gandhi

Rahul Gandhi : జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు భారత సైనికులు చనిపోయిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మండిపడ్డారు. భారత సైన్యంపై గత కొన్ని నెలల్లో భారీగా ఉగ్రదాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. ఈమేరకు ఎక్స్‌లో రాహుల్ గాంధీ ఓ పోస్ట్ చేశారు. ఉగ్రదాడిలో అమరులైన భారత సైనికులకు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

Also Read :Free Bus in AP : ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ – మంత్రి ప్రకటన

మోడీ సర్కారు తప్పుడు విధానాల పర్యవసానాన్ని భారత సైనికులు భరించాల్సి వస్తోందని రాహుల్ వ్యాఖ్యానించారు. కశ్మీర్‌లో జరుగుతున్న భద్రతా  వైఫల్యానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ సైనికులకు హాని చేస్తున్న వారిని ఉపేక్షించకూడదన్నారు. యావత్ దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకం కావాలని రాహుల్ పిలుపునిచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమై దేశ సైన్యానికి దన్నుగా నిలవాలన్నారు. కాగా, గత 32 నెలల్లో జమ్మూకశ్మీర్‌లో జరిగిన వేర్వేరు ఉగ్రదాడి ఘటనల్లో  48 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ నెలలో జరిగిన రెండు ఉగ్ర దాడుల్లో తొమ్మిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

We’re now on WhatsApp. Click to Join

కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాలను అనుసరిస్తూ కశ్మీర్‌ భద్రతను పణంగా పెడుతోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Kharge) ఆరోపించారు. దోడాలో చోటుచేసుకున్న ఉగ్రదాడి  ఘటనపై సాక్షాత్తూ ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది వచ్చి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌తో చర్చించినా  పరిస్థితిలో మార్పు రాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం బూటకపు మాటలు కట్టిపెట్టి.. ఉగ్రవాదుల ఏరివేతకు చిత్తశుద్ధితో కసరత్తు చేయాలని ఆయన కోరారు. భారత సైన్యానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. దోడా ఉగ్రదాడి ఘటనలో అమరులైన నలుగురు వీర సైనికుల కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలనని ఖర్గే పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదంటే.. కేంద్ర ప్రభుత్వం వైఖరి మారాల్సిన అవసరం ఉందన్నారు.