Site icon HashtagU Telugu

President of India: జూలై 25నే రాష్ట్రపతులంతా ఎందుకు ప్రమాణం చేస్తారో తెలుసా?

President Murmu

President Murmu

భారత రాష్ట్రపతి అంటే దేశానికి ప్రథమ పౌరుడు లేదా పౌరురాలు. అలాంటి అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం అంటే మాటలు కాదు. కానీ బంగారం లాంటి ఆ అవకాశం ద్రౌపది ముర్ముకు వచ్చింది. ఆదివాసీ మహిళ అయినా చదువుతోనే అన్నీ గెలుచుకుంటూ వచ్చి.. జీవితంలో విజయం సాధించారు. ఇప్పుడు రాష్ట్రపతి స్థాయికి చేరుకున్నారు. జూలై 25నే రాష్ట్రపతులంతా ప్రమాణం చేయడం వెనకున్న కారణమేంటి?

జూలై 25న రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గత 45 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. 1977 జూలై 25న దేశానికి ఆరో రాష్ట్రపతిగా ప్రమాణం స్వీకారం చేశారు నీలం సంజీవరెడ్డి. ఆ తరువాత ఇప్పటివరకు ఆ పదవిని అలంకరించిన వారంతా జూలై 25నే ప్రమాణ స్వీకారం చేశారు. దీని వెనుక సహేతుకమైన కారణమే ఉంది.

డాక్టర్ రాజేంద్రప్రసాద్ 1950 జనవరి 26న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత 1952 ఎన్నికల్లో ఆయన గెలవడంతోపాటు 1957లో కూడా మళ్లీ విజయం సాధించారు. తరువాత 1962లో సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. అక్కడివరకు ఓకే. కానీ తరువాత రాష్ట్రపతులుగా వచ్చినవారిలో కొందరు పూర్తికాలంపాటు ఆ పదవిలో కొనసాగలేకపోవడం గమనించాల్సిన విషయం.

డాక్టర్ జాకీర్ హుస్సేన్ 1967 మే 13న ప్రమాణ స్వీకారం చేయడం, 1969 మే 3న మరణించడం జరిగాయి. తరువాత వచ్చిన వీవీ గిరి, ఫకృద్దీన్ అలీ అహ్మద్.. వివిధ కారణాలతో రాష్ట్రపతి పదవిలో పూర్తికాలం కొనసాగలేకపోయారు. కానీ 1977 జూలై 25న ప్రమాణం చేసిన నీలం సంజీవరెడ్డి మాత్రం ఐదేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. అప్పటి నుంచి ఆ కుర్చీలో కూర్చున్నవారంతా ఐదేళ్ల తమ పదవీ కాలాలను దిగ్విజయంగా పూర్తిచేశారు.

ఆనాటి నుంచి రాష్ట్రపతులంతా జూలై 25న ప్రమాణ స్వీకారం చేయడం, ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నాక.. జూలై 24న పదవీ విరమణ చేయడం జరుగుతోంది. ఇప్పటివరకు మొత్తం 9 మంది రాష్ట్రపతులు ఇలా జూలై 25నే ప్రమాణం చేశారు. ద్రౌపది ముర్ము ప్రమాణం స్వీకారానికి కూడా ఇదే తేదీని ఫిక్స్ చేయడంతో.. జూలై 25న ప్రమాణం చేసిన రాష్ట్రపతుల జాబితాలో 10వ వ్యక్తిగా నిలిచారు.