ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Delhi Elections 2025) ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్ ప్రక్రియ 6గంటలకు ముగిసింది. ఈసారి అధికారం ఎవరు దక్కించుకుంటారో అనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఇప్పటివరకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ (Delhi Exit Poll 2025) లలో బిజెపి ఈసారి పీఠం దక్కించుకోబోతుందని అంటున్నాయి. మరి అదే జరుగుతుందో..లేదో చూడాలి. ఇక ఇప్పటివరకు ఢిల్లీ పీఠం ఎక్కువ సార్లు దక్కించుకున్న పార్టీ ఏదో ఇప్పుడు చూద్దాం.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల చరిత్ర :
దేశ రాజధాని ఢిల్లీలో మొదటి శాసనసభ ఎన్నికలు 1952లో జరిగాయి. అయితే 1956లో ఢిల్లీని కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తూ రాష్ట్ర శాసనసభను రద్దు చేశారు. 1991లో ప్రత్యేక రాజధాని ప్రాంతంగా గుర్తింపు పొందిన తర్వాత, 1993లో తిరిగి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అనేక మార్లు ఎన్నికలు జరిగాయి. వివిధ రాజకీయ పార్టీలు అధికారాన్ని స్వాధీనం చేసుకున్నాయి.
ఇప్పటి వరకు అధికారం దక్కించుకున్న పార్టీలు :
1993లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని సాధించి మదన్ లాల్ కురానా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1998 నుంచి 2013 వరకు కాంగ్రెస్ అధికారం లో ఉండగా, షీలా దీక్షిత్ వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తొలిసారిగా విజయం సాధించి అర్వింద్ కేజ్రీవాల్ సీఎంగా అయ్యారు.
ఆప్ ప్రభావం – 2015, 2020 ఎన్నికలు
2015లో జరిగిన ఎన్నికల్లో ఆప్ 66 స్థానాలు గెలుచుకుని బీజేపీని చిత్తుచేసింది. 2020 ఎన్నికల్లో కూడా ఆప్ 62 సీట్లతో విజయాన్ని సాధించింది. అయితే ఇటీవల లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కేజ్రీవాల్ జైలుకు వెళ్లడం, అతిశీని ముఖ్యమంత్రిగా నియమించుకోవడం రాజకీయంగా సంచలనం సృష్టించింది.
2025 ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ :
ఈసారి కూడా ఢిల్లీలో ఉత్కంఠ భరితమైన రాజకీయ పోటీ కనిపిస్తోంది. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందా, లేక ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి విజయం సాధిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అధికారిక ఫలితాలు వెలువడే వరకు రాజకీయ వర్గాలు, ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.