Site icon HashtagU Telugu

Women’s Reservation Bill : విరుచుకుపడిన విపక్షాలు.. విస్తుపోయిన పాలక పక్షం

Reservation Bill

Disrupted Opposition. Disrupted Ruling Party In New Parliament On Women's Reservation Bill

By: డా. ప్రసాదమూర్తి

Women’s Reservation Bill : కొత్త పార్లమెంటు భవనంలో రెండో రోజు సమావేశాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు మీద కేంద్రీకృతమయ్యాయి. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా, 27 సంవత్సరాలుగా వెలుగు చూడని మహిళా రిజర్వేషన్ బిల్లును నిర్లక్ష్యం చేసిన అధికార బిజెపి, ఇప్పుడు అకస్మాత్తుగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పిలిచి మరీ కొత్త పార్లమెంటు భవనంలో సమావేశాల తొలి రోజునే, తొలి బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లును (Women’s Reservation Bill) ప్రవేశపెట్టింది. మరి ఇన్నేళ్లుగా గుర్తుకురాని మహిళలు ఇప్పుడే ఆకస్మాత్తుగా ఎందుకు గుర్తుకు వచ్చారు? అనే ప్రశ్న పాలక పక్షం ప్రధానంగా ఎదుర్కొంటుంది.

ఇప్పటికే మహిళా మల్లయోధులు తమపై జరిగిన లైంగిక దాడి గురించి న్యాయం కోసం ఒక యుద్ధమే చేశారు. అయినా వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి న్యాయమూ దక్కలేదు. మణిపూర్ లో కుకీ సముదాయానికి చెందిన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో దోషులను నిర్ధారించి శిక్షించడంలో ప్రభుత్వం ఎలాంటి సతర్కతా చూపించలేదు. బేటీ పఢావో భేటీ బచావో అనే నినాదాలు తప్ప దేశంలో బేటీలకు ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అనే విమర్శ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం తటాలున ఈ మహిళ రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చింది. ఆలస్యంగానైనా ప్రభుత్వానికి మంచి ఆలోచన వచ్చిందని అందరూ భావించారు.

కానీ ఈ బిల్లు ప్రభుత్వం తీసుకురావడం అయితే చేసింది గాని, అమలు చేయడానికి మాత్రం సంసిద్ధంగా లేదని బిల్లులో ఉన్న అవరోధాలను బట్టి అర్థమవుతోంది. ఏ విధంగా చూసినా జనాభా లెక్కల పూర్తి కావడం, ఆ తరువాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగడం లాంటి తతంగాలు, సాంకేతికమైన అవరోధాల కారణంగా ఈ వచ్చే ఎన్నికలు కాదు కదా ఆ పై వచ్చే ఎన్నికలకు కూడా ఈ బిల్లు అమలు జరిగే అవకాశం కనిపించడం లేదు. అయితే ప్రభుత్వం ఆలోచన మరో రకంగా ఉన్నట్టు ప్రతిపక్షాలు పసిగట్టాయి. అదేమిటంటే బిల్లు తీసుకువచ్చిన ఘనత తాము కొట్టి, బిల్లులో ఓబీసీ మహిళల కోటా ప్రస్తావన లేకపోవడం వల్ల కాంగ్రెస్ కి ఇతర ప్రతిపక్షాలకి మధ్య ఘర్షణ పెట్టి తమాషా చూడాలని పాలకపక్షం ఎత్తుగడ వేసినట్టుగా అర్థమవుతుంది.

అయితే ఈ ఎత్తుగడను ఈరోజు పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు (Women’s Reservation Bill) మీద జరిగిన చర్చలో పాల్గొన్న ప్రతిపక్షాలు చిత్తు చేశాయి. ముఖ్యంగా ఈ బిల్లు మీద మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ దేశంలో మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలనేది తన జీవన సహచరుడు రాజీవ్ గాంధీ స్వప్నమని బల్లగుద్ది చెప్పారు. అంతేకాదు, ఈ బిల్లును మీరు ఎప్పటికి అమలు చేస్తారు? రెండేళ్లా.. నాలుగేళ్లా.. ఎనిమిదేళ్లా.. తేల్చి చెప్పండి అని బల్లగుద్ది ఆమె ప్రశ్నించారు. అంతటితో ఆగలేదు, ఈ బిల్లును తక్షణమే అమలు చేసి, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు జరిగేటట్టు చూడాలని ఆమె డిమాండ్ చేశారు కూడా. అంతేనా, బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించే వెసులుబాటును కల్పించి తీరాలని ఆమె నొక్కి వక్కాణించారు.

బిల్లును తక్షణమే అమలు చేయాలని బిల్లుకు తమ బేషరతు మద్దతు ఇస్తున్నామని, కానీ బిల్లులో ఏమేమి లోపాలు ఉన్నాయో ఎత్తిచూపుతూ వాటిని పరిష్కరించి తక్షణమే అమలు చేయాలని సోనియాగాంధీ డిమాండ్ చేశారు. అలాగే మిగిలిన ప్రతిపక్షాలు కూడా ఈ బిల్లుని ఇప్పుడు ప్రవేశపెట్టడంలో అధికార బిజెపి అంతరంగాన్ని ప్రశ్నిస్తూ విరుచుకుపడ్డాయి. అధికార పార్టీకి మహిళల పట్ల, వెనకబడిన జాతుల పట్ల ఎలాంటి మమకారం లేదని, కేవలం తమ రాజకీయం కోసమే ఈ బిల్లును ప్రవేశపెట్టారని, చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే ఈ బిల్లును తక్షణమే అమలు చేయడానికి అన్ని చర్యలూ తీసుకోవాలని, తమ మద్దతు దానికి ఉంటుందని ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే, జెడౌ యు, శివసేన మొదలైన పార్టీలన్నీ డిమాండ్ చేశాయి.

దీనితో ప్రభుత్వం పని కుడితిలో పడ్డ ఎలకలా అయిపోయింది. తలచింది ఒకటి, జరిగింది మరొకటి. హడావిడిగా బిల్లును ప్రవేశపెట్టి ఆ క్రెడిట్ పూర్తిగా తామే కొట్టేయాలని అనుకున్నారు. ఎంత ప్రయత్నించినా మహిళల రిజర్వేషన్ విషయంలో క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకే దక్కేలా ఉంది. అంతటితో ఆగుతుందా, ఈ బిల్లును తక్షణమే అమలు చేయకపోతే తమను పూర్తిగా ప్రతిపక్షాలు బజారుకీడ్చే ప్రమాదం ఉందని కూడా ప్రభుత్వ వర్గాలు బెంబేలు పడ్డాయి.

మరి దీని మీద అధికారపక్షం ఎలా స్పందిస్తుందో.. బిల్లు అమలు విషయంలో తమ నిజాయితీని ఎలా ప్రదర్శించుకుంటుందో వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా రెండవ రోజు సమావేశాల్లో కొత్త పార్లమెంటు భవనంలో విపక్షాల విశ్వరూపాన్ని.. విభ్రమకు లోనైన అధికారపక్షాన్ని స్పష్టంగా దేశమంతా చూసింది.

Also Read:  Telangana Congress Candidates First List : తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ సభ్యులు వీరేనా..?