Disha Salian: రాష్ట్రపతిగారూ న్యాయం చేయండి.. లేదంటే చావే దిక్కు!

దిశా సాలియన్... ముంబై రాజకీయాల్లో ఇప్పుడీ పేరు సంచలనం. రెండేళ్ల కిందట సూసైడ్ చేసుకున్న బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ దగ్గర మేనేజర్ గా పనిచేశారు దిశా సాలియన్.

  • Written By:
  • Updated On - March 26, 2022 / 11:27 AM IST

దిశా సాలియన్… ముంబై రాజకీయాల్లో ఇప్పుడీ పేరు సంచలనం. రెండేళ్ల కిందట సూసైడ్ చేసుకున్న బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ దగ్గర మేనేజర్ గా పనిచేశారు దిశా సాలియన్. అది కేవలం ఉద్యోగమే.. కానీ అదే శాపంగా మారిందేమో! ఎందుకంటే.. సుశాంత్ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు దిశ కూడా చనిపోయారు. దీంతో ఇద్దరి మరణం.. 2020లో మిస్టరీగా మారింది. కొందరు రాజకీయ నాయకులు.. దిశ మరణాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారన్నది దిశ కుటుంబం ఆరోపణ. దీంతో తమ ఫ్యామిలీ అంతా నరకం అనుభవిస్తోందని.. వేధింపులకు గురవుతోందని.. ఆవేదన చెందుతూ రాష్ట్రపతికి లేఖ రాసింది దిశ కుటుంబం.

తమ కుమార్తె దిశ పేరును చెడుగా వినియోగిస్తు్న్నారని.. అలా వాడకుండా చూడాలని ఆ కుటుంబం ఇప్పటికే దేశంలో ప్రముఖులందరికీ విజ్ఞప్తి చేసింది. పీఎం, హోం మినిస్టర్, మహారాష్ట్ర సీఎం, ప్రతిపక్ష నేత ఫడ్నవిస్, ముంబై హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అందరినీ వేడుకుంది. అయినా సరే.. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం తమ కుమార్తె పేరును వాడుకుంటున్నారని ఆవేదన చెందింది. దిశ చనిపోయిన కొన్నాళ్లకే సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ రెండు మరణాలను ముడిపెడుతూ కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. నారాయణ్ రాణే, నితేశ్ రాణే.. ఈ ఇద్దరూ.. ఆదిత్య ఠాక్రే, ఉద్దవ్ ఠాక్రేలతో ఉన్న విభేదాల వల్ల దిశ పేరును రాజకీయంగా వినియోగించుకుంటున్నారని దిశ కుటుంబం ఆరోపించింది. తమ కుమార్తె.. 2020 జూన్ 4 తరువాత ఇంటి నుంచి బయటకు వెళ్లలేదని తన స్నేహితుల ద్వారా ఈ కుటుంబానికి తెలిసింది. ఆ విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా పరిశీలించాని, నిజానిజాలను చెప్పాలని కోరింది.

దిశ రూమ్ లోకి కొంతమంది వ్యక్తులు ప్రవేశించారని.. ఆమెపై అత్యాచారం చేశారన్నారు నారాయణ్ రాణే. కానీ ఈ ఆరోపణల వల్ల తాము చాలా అవమానాలను ఎదుర్కొన్నామన్నారు దిశ కుటుంబసభ్యులు. సమాజంలో తలెత్తుకోలేకపోయామన్నారు. ఇదంతా తమ కుమార్తె వ్యక్తిత్వాన్ని, ఆమె పేరును చెడగొట్టేలా ఉందంటూ బాధపడింది. అందుకే చచ్చిపోవాలని కూడా అనుకున్నామని ఆవేదన చెందింది. తమను ఇంతటి బాధకు గురిచేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని కోరింది. లేదంటే.. చావే దిక్కు అని చెప్పింది.