Diplomatic War : కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత శశిథరూర్‌కు కేంద్రంలోని మోడీ సర్కారు పెద్దపీట వేస్తోంది. ఈక్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదం గురించి భారత ప్రభుత్వం తరఫున ప్రపంచ దేశాలకు వివరించేందుకు 7 అఖిలపక్ష టీమ్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో ఒక టీమ్ సారథ్య బాధ్యతలను శశిథరూర్‌కు మోడీ అప్పగించారు. ఈ అఖిలపక్ష టీమ్‌లు పర్యటించేందుకు వివిధ దేశాలను కేటాయించారు. ఇందులోనూ శశిథరూర్‌కు కేంద్ర సర్కారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. కీలకమైన అమెరికా, బ్రెజిల్ దేశాల పర్యటన బాధ్యతను శశిథరూర్ సారథ్యంలోని అఖిలపక్ష టీమ్‌కు అప్పగించారు. ఈ టీమ్ పనామా, గయానా, కొలంబియాలలో కూడా పర్యటిస్తుంది. పాకిస్తాన్ మిత్రదేశం తుర్కియేకు వేల కోట్లు విలువైన అమ్రామ్ మిస్సైళ్లను విక్రయించే డీల్‌కు ఇటీవలే అమెరికా పచ్చజెండా ఊపింది. దీనిపై భారత అఖిల పక్ష టీమ్ అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది.
కనిమొళి టీమ్ ఏ దేశాలకు..
భారత్‌కు అత్యంత సన్నిహిత దేశం రష్యాకు సంబంధించిన పర్యటన బాధ్యతలను డీఎంకే ఎంపీ కనిమొళి(Diplomatic War) సారథ్యంలోని అఖిలపక్ష టీమ్‌కు అప్పగించారు. ఈ టీమ్ స్పెయిన్, గ్రీస్, స్లొవేనియా, లాత్వియా దేశాల్లోనూ పర్యటిస్తుంది.
సుప్రియా సూలే టీమ్ ఏ దేశాలకు..
మరో విపక్ష నాయకురాలు, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే సారథ్యంలోని అఖిలపక్ష టీమ్‌కు కీలకమైన దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఖతర్‌లలో పర్యటించే అవకాశాన్ని కల్పించారు. ఈజిప్టు, ఖతర్‌లకు పాకిస్తాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సుప్రియా సూలే టీమ్ ఆఫ్రికా దేశం ఇథియోపియాలోనూ పర్యటిస్తుంది.
Also Read :India Pakistan Ceasefire : ‘కాల్పుల విరమణ’పై భారత ఆర్మీ కీలక ప్రకటన
సంజయ్‌కుమార్ ఝా టీమ్ ఏ దేశాలకు..
జేడీయూ నేత సంజయ్‌కుమార్ ఝా సారథ్యంలోని అఖిలపక్ష టీమ్ కీలకమైన జపాన్, దక్షిణ కొరియా, ఇండోనేసియా,సింగపూర్ దేశాలలో పర్యటిస్తుంది. ఇండోనేసియాతో పాక్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
శ్రీకాంత్ షిండే టీమ్ ఏ దేశాలకు..
శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే సారథ్యంలోని అఖిలపక్ష టీమ్ యూఏఈలో పర్యటిస్తుంది. యూఏఈతో భారత్, పాక్ రెండు దేశాలతోనూ బలమైన సంబంధాలు ఉన్నాయి. ఈ టీమ్ లైబీరియా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియెర్రా లియోన్‌లలోనూ పర్యటిస్తుంది.
బైజయంత్ పాండా సారథ్యంలోని టీమ్..
బీజేపీ నేత బైజయంత్ పాండా సారథ్యంలోని అఖిలపక్ష టీమ్ కీలకమైన సౌదీఅరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియాలలో పర్యటిస్తుంది. సౌదీ, అల్జీరియాలతో పాక్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
రవిశంకర్ ప్రసాద్ సారథ్యంలోని టీమ్..
బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ సారథ్యంలోని టీమ్ కీలకమైన బ్రిటన్ (యూకే), ఫ్రాన్స్, జర్మనీ, యూరోపియన్ యూనియన్, ఇటలీ, డెన్మార్క్‌లలో పర్యటిస్తుంది.