LIC Shares : ఎల్ఐసీ షేర్ ఢమాల్.. వాటాదారుల లబోదిబో.. మరి అమ్మాలా? ఉంచాలా?

అంతన్నారు.. ఇంతన్నారు.. తీరా చూస్తే.. తుస్సుమంది. అది కూడా అలా ఇలా కాదు. ఒక్కో షేర్ మీద దాదాపు రూ.200 నష్టపోయిన పరిస్థితి.

  • Written By:
  • Publish Date - June 11, 2022 / 05:30 PM IST

అంతన్నారు.. ఇంతన్నారు.. తీరా చూస్తే.. తుస్సుమంది. అది కూడా అలా ఇలా కాదు. ఒక్కో షేర్ మీద దాదాపు రూ.200 నష్టపోయిన పరిస్థితి. భారత బీమా రంగంలో దిగ్గజ సంస్థగా పేరు గాంచడం, ప్రభుత్వ సంస్థగా ఉండడంతో దానిపై ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని ఉంచారు. అందుకే ఎల్ఐసీ షేర్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దాని ఐపీవో కోసం ఇన్వెస్టర్లు భారీగా మదుపు పెట్టారు. ఆ షేర్లు తమకు కేటాయించారని తెలియగానే చాలా సంబరపడ్డారు. భవిష్యత్తులో ఇక తమకు తిరుగులేదు అనుకున్నారు. కానీ జూన్ 1 శుక్రవారం నాటికి దాని షేరు ధర. రూ.709.40 కు పడిపోవడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు.

కిందటి నెలలో పబ్లిక్ ఇష్యూకు వచ్చిన ఎల్ఐసీ… ఇన్వెస్టర్ల నుంచి రూ.20,500 కోట్లు సమీకరించగలిగింది. కంపెనీ ఎప్పుడైతే మే 17న లిస్ట్ అయ్యిందో.. అప్పుడు దాని ధర రూ.949. తరువాత ఒకే ఒకసారి ఆ షేరు ధర అత్యధికంగా రూ.920ని తాకగలిగింది. అంతే ఆ తరువాత షేర్ ధర పడిపోతూ వచ్చిందే తప్ప ఏ రోజు పెరగలేదు. ఒకవేళ పెరిగినా.. అప్పుడప్పుడు ముందుకెళుతూ మళ్లీ వెనక్కు వచ్చింది. అందులోనూ మార్కెట్ కూడా డౌన్ ఉండడంతో ఎల్ఐసీ షేర్ పెర్ ఫార్మెన్స్ మార్కెట్లో మరీ డల్ గా ఉంది. దీంతో అంత నమ్మకం పెట్టుకుని ఐపీవో కోసం ప్రయత్నిస్తే.. ఇప్పుడు నెల కూడా గడవకముందే షేర్ ధర ఇంతలా పడిపోవడంతో మదుపరులు అంతా లబోదిబోమంటున్నారు.

షేర్ మార్కెట్లో ఎల్ఐసీకి ఎదురైన గడ్డు పరిస్థితి తాత్కాలికమే అంటున్నారు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల విభాగం – దీపం కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే. సంస్థ గురించి షేర్ మార్కెట్ ఇన్వెస్టర్లు తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుందని.. అప్పటివరకు ఒడిదొడుకులు తప్పవన్నారు. ఎల్ఐసీ కూడా ఇప్పుడున్న పరిస్థితులను సమీక్షించి.. వాటాదారులకు మరింత విలువను చేకూర్చేలా చర్యలు తీసుకుంటుందన్నారు.