Dinesh Trivedi : రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా దినేష్ త్రివేది?

రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎవ‌రో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌దు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఎలాంటి అభ్య‌ర్థిని ఎంపిక చేస్తారో కూడా అంతుబ‌ట్ట‌దు.

  • Written By:
  • Publish Date - June 9, 2022 / 05:04 PM IST

రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎవ‌రో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌దు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఎలాంటి అభ్య‌ర్థిని ఎంపిక చేస్తారో కూడా అంతుబ‌ట్ట‌దు. గ‌తంలోనూ అదే జ‌రిగింది. రాష్ట్ర‌ప‌తిగా రామ్ నాద్ కోవింద్ ను ఎంపిక చేసే వ‌ర‌కు ఆయ‌న పేరు ఎక్క‌డా ప్ర‌చారంలోకి రాలేదు. ఈసారి కూడా ప‌లు పేర్లు ప్ర‌చారంలో ఉన్న‌ప్ప‌టికీ చివ‌రి నిమిషంలో మోడీ, షా మ‌దిలో ఉండే అభ్య‌ర్థి ఎవరు అనేది అంచ‌నా వేయ‌డం క‌ష్టం. కానీ, వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మాత్రం రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిని ప‌సిగ‌ట్టిన‌ట్టు ఉన్నారు. ముందుగానే దినేష్ త్రివేది అనే పెద్ద మ‌నిషిని క‌లిశారు. ముంద‌స్తుగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాల స‌మాచారం.

త్రివేది కేంద్ర మంత్రి కాదు, క‌నీసం ఎంపీ కూడా కాదు. ఉత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్ గా త్రివేదికి పేరుంది. మాజీ మంత్రి, సీనియ‌ర్ పొలిటిషియ‌న్ గా గుర్తింపు ఉంది. ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటోన్న త్రివేదిని విజయసాయిరెడ్డి క‌లిసి ముందుగా శుభాకాంక్ష‌లు తెలిపార‌ట‌. గ‌తంలోనూ ఇలాంటి ముంద‌స్తు శుభాకాంక్ష‌లు తెలిపిన సంఘ‌ట‌న‌లు విజ‌య‌సాయిరెడ్డి డైరీలో ఉన్నాయ‌ని కొంద‌రు గుర్తు చేస్తున్నారు. ఎవరైనా కీలకపదవిలోకి వెళ్లబోతున్నారని తెలిసిన మరుక్షణం ఖరీదైనగిఫ్టులు, శాలువాలూ, తిరుపతి ప్రసాదం వంటివి తీసుకుని ఆయ‌న వెళ్లిపోతార‌ట‌. సన్మానంచేసి నమస్కారం పెట్టేస్తారు. ఆ అలవాటు ప్ర‌కారం దినేష్ త్రివేదీ ఇంటికి సాయిరెడ్డి వెళ్లారని టాక్‌.

త్రివేది పేరును రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి పదవికి పరిశీలిస్తున్నారని తెలుస్తోది. దాదాపుగా ఆయ‌న పేరు ఖరారు అవుతుంద‌ని స‌మాచారం అందుకున్న విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు చెప్పారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు వైసీపీ తప్పని సరిగా మద్దతిస్తుంది. ఎలాంటి షరతులుపెట్టలేదు. కొన్ని షరతులను ఇప్పటికే కేంద్రం ఆమోదించింది. ధర్మారెడ్డికి డిప్యూటేషన్ లాంటివి పూర్తి చేసింది. అందుకే మాట వరుసకు అభ్యర్థులెవరో ఖరారు చేసుకుని వైసీపీ హైకమాండ్‌కు చెప్పిందని తెలుస్తోంది. ఆ క్ర‌మంలోనే ముంద‌స్తు ప్రసన్నం కోసం వైసీపీ పరుగులు పెడుతోందని ప్ర‌చారం జ‌రుగుతోంది.

దావోస్ నుంచి వ‌చ్చిన వెంట‌నే ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. రెండు రోజుల పాటు అక్కడే ఉన్న ఆయ‌న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాను క‌లిశారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో మ‌ద్ధ‌తు కోసం ఆయ‌న్ను ఢిల్లీ పిలిపించార‌ని ఆనాడే టాక్ న‌డిచింది. ఎన్డీయేకు మ‌ద్ధ‌తు ఇవ్వ‌డానికి సూత్ర‌ప్రాయంగా జ‌గ‌న్ అంగీక‌రించార‌ని తెలుస్తుంది. ఆ క్ర‌మంలో బీజేపీ అగ్ర‌నేత‌లుగా ఉన్న మోడీ, షా బ‌హుశా రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి పేరు లీకు చేసి ఉండొచ్చు. అందుకే, కాబోయే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిని ముందుగానే ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి సాయిరెడ్డి ప్ర‌యత్నం చేశాడ‌ని తెలుస్తోంది.

రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింద‌తి. జూలై 25న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 62 ప్రకారం ఆనాటి కల్లా కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటు ఉభయసభలకు ఎన్నికైన పార్లమెంటు సభ్యులు, అన్ని రాష్ట్రాలు, ఢిల్లీ, పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికైన చట్టసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. 776 పార్లమెంటేరియన్లు, 4,120 మంది లెజిస్లేటర్లు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఈ ఎలక్టోరల్ కాలేజీ బలం 10,98,903 ఓట్లుగా ఉంటుంది. లోక్ సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలిలోని నామినేటెడ్ సభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో ఉండరు. వీరికి ఓటు ఉండదు.

బ్యాలెట్ పేపర్ విధానంలో ఓటింగ్ ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే పెన్నుతోనే ఓటు వేయాల్సి ఉంటుంది. వేరే పెన్నుతో ఓటు వేస్తే అది చెల్లుబాటు కాదు. అంతేకాదు, రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీలు విప్ జారీ చేయకూడదు. ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం ఉంటుంది. నిబంధ‌న‌ల ప్ర‌కారం విప్ కూడా ఉండ‌దు కాబ‌ట్టి టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ మూకుమ్మ‌డిగా ఎన్డీయే అభ్య‌ర్థికి గ‌తంలో మాదిరిగా ఓటు వేస్తాయ‌ని అంచ‌నా వేయ‌డానికి అవ‌కాశం ఉంది. జాతీయ స్థాయిలో విప‌క్షాల‌తో క‌లిసి ఉమ్మ‌డి అభ్య‌ర్థిని నిల‌పాల‌ని కేసీఆర్ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్ప‌టికీ అసాధ్యంగా ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఆ క్ర‌మంలో దినేష్ త్రివేదికి వ్య‌క్తిగ‌తంగా మ‌ద్ధ‌తు అంటూ ఓటు చేసే అవ‌కాశం ఉంది.