Surrogacy: సరోగసీని సమాధి చేసిన కొత్త చట్టం… వైద్యుల వాదన

సినీ నటి నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ ఈ నెల 10న సరోగసీ ద్వారా కవలలకు జన్మనిచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సరోగసీపై చర్చ మొదలైంది.

  • Written By:
  • Publish Date - October 24, 2022 / 08:34 AM IST

సినీ నటి నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ ఈ నెల 10న సరోగసీ ద్వారా కవలలకు జన్మనిచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సరోగసీపై చర్చ మొదలైంది. వారు సరోగసీ చట్టాలను ఉల్లంఘించారని ఆరోపణలు, ఊహాగానాలు సర్వత్రా వ్యాపించాయి. సరోగసీ అంటే అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడం. ఇతర
మహిళ, పురుషులకు చెందిన బిడ్డను మరొక మహిళ తన గర్భంలో మోస్తారు. బిడ్డను మోసే మహిళకు ఆ బిడ్డ మీద ఎటువంటి హక్కులు ఉండవు.అండం, వీర్యం ఇచ్చిన వారే ఆ బిడ్డకు తల్లిదండ్రులు అవుతారు.సరోగసీ చట్టం పేద, అట్టడుగు సామాజిక వర్గాల స్త్రీలను దోపిడీకి గురిచేస్తుందన్న కారణంతో కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సరోగసీని నిషేధిస్తూ ఈ ఏడాది జనవరి 25న కొత్త చట్టం చేసింది. పాత చట్టంలో కేవలం ఎన్నారైలు, విదేశీ పౌరులకు మాత్రమే సరోగసీని నిషేధిస్తే, కొత్త చట్టం సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్‌లో వాణిజ్య సరోగసీని పూర్తిగా నిషేధించారు. అయితే, పరోపకార సరోగసీకి మాత్రం అనుమతించారు. అంటే గర్భం దాల్చే స్త్రీ నిస్వార్ధంగా డబ్బులు తీసుకోకుండా ఇష్టపూర్వకంగా ముందుకు రావాలి. అంతేకాకుండా ఆమె దంపతులకు బంధువై ఉండాలి. అలాగే, పెళ్లి అయిన ఐదేళ్ల తరువాత మాత్రమే సరోగసీకి వెళ్లాలి. అంతకు ముందు వారు స్వయంగా గర్భం దాల్చి, పిల్లలను కనేందుకు వైద్య పరమైన అడ్డంకులు ఉన్నట్లు నిర్ధారించాలి. బిడ్డను కోరుకునే జంటకు కచ్చితంగా పెళ్లి జరిగి ఉండాలి. మహిళ వయసు 23 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. పురుషుని వయసు 26 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

సరోగసీ ద్వారా పిల్లలను కోరుకునే దంపతులకు పిల్లలు ఉండకూడదు. ఎవరినీ దత్తత తీసుకొని ఉండకూడదు. సరోగసీ ద్వారా కూడా పిల్లలను కని ఉండకూడదు.అయితే పిల్లలు మానసికంగా లేదా శారీరకంగా వైకల్యంతో ఉన్నప్పుడు లేదా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నప్పుడు దంపతులు సరోగసీ ద్వారా మరొక బిడ్డను కనొచ్చు. సరోగసీ ద్వారా పిల్లలను కనాలంటే ఆ అవసరం ఉందో లేదో ముందు సంబంధిత వైద్య అధికారుల నుంచి దంపతులు అనుమతి తీసుకోవాలి.
కొత్త చట్టంలో పెళ్లి కాని వ్యక్తుల ప్రస్తావన లేదు. ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు, లెస్బియన్,గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్(ఎల్జీబీటీ)లకు సరోగసీ ద్వారా బిడ్డలను కనే అవకాశం లేదు. సహజీవనం చేసే జంటలకు కూడా సరోగసీ అవకాశం లేదు.అయితే, కొందరు దీనిపై ఈ ఏడాది మేలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇలా పిల్లలను కనే హక్కును దూరం చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్-21కి విరుద్ధమని పిటిషనర్ వాదించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది.

కొత్త చట్టం ప్రకారం ఎటువంటి ప్రయోజనాలు లేకుండా ఎంతమంది మహిళలు సర్రోగేట్ తల్లులుగా ఉండటానికి ముందుకొస్తారనేది పెద్ద ప్రశ్నగా మారిందని బెంగుళూరు కోరమంగళలోని గుణశీల హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ స్పెషలిస్ట్ డాక్టర్ అశ్విని చెప్పారు. కొత్త చట్టం వల్ల భారతదేశంలో సరోగసీ దాదాపు అసాధ్యమే అని అభిప్రాయపడుతున్నారు. కొత్త చట్టంలోని నిబంధనలతో ఏది చట్టపరమైనది, ఏది చట్టవ్యతిరేకమైనది అనే దానిపై గందరగోళం నెలకొందని వైద్యనిపుణులు చెబుతున్నారు. దీంతో, సరోగసీ గర్భాలు దాదాపు పూర్తిగా తగ్గిపోయాయి. కొత్త చట్టంతో పిల్లలు లేని జంటలకు సరోగసీ ద్వారా బిడ్డలు పొందే అవకాశాలు దాదాపు కోల్పోయినట్లేనని వైద్యులు చెబుతున్నారు. ఎటువంటి ప్రయోజనాలు లేకుండా తొమ్మిది నెలల పాటు శరీరాన్ని అద్దెకిచ్చి బిడ్డలను ఎవరు కంటారు?. ఈ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఒక్క సరోగసీ కూడా చేయని ఫెర్టిలిటీ సెంటర్లు కూడా ఉన్నాయి.

గర్భం అద్దెకు ఇచ్చే తల్లి శరీరం తొమ్మిది నెలలపాటు అనేక కష్టాలు పడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఎటువంటి ప్రోత్సాహం లేకుండా మహిళలు ముందుకొచ్చి గర్బం అద్దెకిచ్చే పరిస్థితి ఉండదని డాక్టర్ అశ్విని చెబుతున్నారు. బెంగుళూరు మెడికల్ కాలేజీ ప్రసూతి, గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ మాత్రం కొత్త చట్టానికి మద్దతు తెలుపుతున్నారు. నిరక్షరాస్యులైన మహిళలు, తక్కువ సామాజిక-ఆర్థిక నేపథ్యాల నుంచి వచ్చిన వారు పాత చట్టంతో దోపిడీకి గురయ్యేవారని, ఎన్నిసార్లు సర్రోగేట్‌ తల్లులుగా ఉండవచ్చనే దానిపై పరిమితి ఉన్నప్పటికీ దానిని పాటించలేదని డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు.నయనతార కవల పిల్లల విషయంలో వారు చట్ట పరిధిలోనే ఉండవచ్చన్న అభిప్రాయాన్ని డాక్టర్ అశ్విని వ్యక్తం చేశారు.

జనవరి 25 తర్వాత నయనతార, విఘ్నేష్ కమర్షియల్ సరోగసీ కోసం వెళితే, వారు చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. వారి పెళ్లి జూన్‌ 7న జరిగింది. అక్టోబరు 10న వారికి కవలలు జన్మించారు. కొత్త చట్టం ఇందుకు అంగీకరించదు. కవల పిల్లల పుట్టుకకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఈ దంపతులను తమిళనాడు వైద్య, ప్రజా సంక్షేమ శాఖా మంత్రి ఎం. సుబ్రహ్మణ్యం, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డీఎంఎస్) వివరణ కోరారు. ఈ విషయమై ఏర్పాటు చేసిన త్రిసభ్య విచారణ కమిటీ నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేసింది. విఘ్నేష్ శివన్‌ను ఆరేళ్ల కిందటే పెళ్లి చేసుకున్నట్లు నయనతార ఆధారాలను కమిటీకి సమర్పించినట్లు తెలుస్తోంది. భారతీయ సరోగసీ చట్టం ప్రకారం దంపతులు తల్లిదండ్రులు కావాలంటే వారి పెళ్లి జరిగి అయిదేళ్లు పూర్తి అయి ఉండాలి. ఈ ప్రకారమే వారిద్దరూ కవలలకు అమ్మానాన్నలు అయినట్లు వెల్లడించారు.