PK’s Reason: రాహుల్, ప్రియాంకల మధ్య విభేదాలే.. కాంగ్రెస్ కు పీకేను దూరం చేశాయా?

రాహుల్ గాంధీ, ప్రియాంకలు ఎప్పుడు చూసినా సరదాగా ఉంటారు. కుటుంబం పట్ల బాధ్యతతో మెసులుకుంటారు. కానీ పార్టీ విషయంలో వీరి మధ్య విభేదాలు నెలకొన్నాయా?

  • Written By:
  • Publish Date - April 28, 2022 / 09:58 AM IST

రాహుల్ గాంధీ, ప్రియాంకలు ఎప్పుడు చూసినా సరదాగా ఉంటారు. కుటుంబం పట్ల బాధ్యతతో మెసులుకుంటారు. కానీ పార్టీ విషయంలో వీరి మధ్య విభేదాలు నెలకొన్నాయా? అదే కాంగ్రెస్ పార్టీకి పీకేను దూరం చేసిందా? పార్టీ వర్గాల్లో కూడా దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నిజానికి కాంగ్రెస్ లోకి పీకే ఎంటర్ అవ్వడానికి కారణం.. ప్రియాంకనే. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల తరువాత పార్టీకి కొత్త శక్తి అవసరమని ప్రియాంక భావించారు. అందుకే ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకోవాలని సోనియాను కోరారు. అయితే పార్టీలోకి పీకే ఎంట్రీ రాహుల్ కు ఇష్టం లేదు. అయినా సరే.. పీకే ప్రజంటేషన్ కు అంగీకరించారు.

ప్రియాంక ఒత్తిడితో సోనియాగాంధీ.. పీకేతో సమావేశాన్ని ఏర్పాటుచేసినా.. ఆ మీటింగ్ లో కేవలం ఒక్కరోజే రాహుల్ పాల్గొన్నారు. ఆ తరువాత విదేశాలకు వెళ్లిపోయారు. ప్రశాంత్ కిషోర్ సేవలను పార్టీ ఉపయోగించుకోదు అని ఆ తరువాత ప్రియాంకకు అర్థమైంది. దీంతో ఆమె కూడా విదేశాలకు వెళ్లిపోయారు. అయితే ప్రియాంకను పార్టీ అధ్యక్షురాలిగా చేయాలని.. రాహుల్ ను పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా చేయాలని పీకే ప్రతిపాదించడమే కుటుంబంలో అగ్గి రాజేసిందన్నది పార్టీ వర్గాల టాక్.

కాంగ్రెస్ పార్టీ వరుస అపజయాలతో ప్రియాంక కలత చెందారని.. అందుకే రాహుల్ కు బదులు తాను పార్టీ పగ్గాలు తీసుకోవాలని అనుకున్నారని సమాచారం. కానీ ఇది రాహుల్ కి ఇష్టం లేదు. అందుకే ఆమె తీసుకువచ్చిన పీకేకు పొమ్మనకుండా పొగబెట్టారు. కేవలం ఓ కమిటీలో సాధారణ సభ్యుడిగా మాత్రమే ఉండాలని చెప్పారు. ఇది పీకేకు నచ్చకపోవడంతో వెనక్కు తగ్గారు.

తాను కాంగ్రెస్ లో చేరబోనని పీకే చెప్పినా సరే.. పార్టీలోకి రావాలనుకునేవారికి తలుపులు తెరిచే ఉంటాయని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో పీకే మళ్లీ ఎంట్రీ ఇస్తారా అన్న అనుమానాలు లేకపోలేదు.