Devendra Fadnavis : అందరూ అనుకున్నదే జరిగింది. మహారాష్ట్ర తదుపరి సీఎంగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ పేరు ఖరారైంది. బుధవారం ముంబైలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో సీఎం పదవి కోసం దేవేంద్ర ఫడ్నవిస్ పేరును ప్రతిపాదించగా రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.
Also Read :Sukhbir Singh Badal : సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు.. స్వర్ణ దేవాలయంలో కలకలం
ముంబైలోని విధాన్ భవన్‌లో బీజేపీ కోర్ కమిటీ భేటీ(Devendra Fadnavis) జరిగింది. దీనికి కేంద్ర పరిశీలకులుగా ఉన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ హాజరయ్యారు. అనంతరం అక్కడే బీజేపీ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించారు. సీఎం ఎంపికపై పార్టీ ఎమ్మెల్యేలతో సీతారామన్, విజయ్ రూపానీ చర్చించారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో మహారాష్ట్రలో సీఎం సీటుపై, ప్రభుత్వ ఏర్పాటుపై గత కొన్ని వారాలుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. డిసెంబరు 5న(గురువారం రోజు) ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో మహారాష్ట్ర సీఎంగా ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా ఎన్డీయే కీలక నేతలు హాజరుకానున్నారు. డిప్యూటీ సీఎంలుగా శివసేన నేత ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేస్తారు. అయితే వీరిద్దరి పదవులపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.