Site icon HashtagU Telugu

Maharashtra Politics: మ‌హా సంక్షోభానికి తెర, సీఎంగా ఫ‌డ్న‌విస్, డిప్యూటీ సీఎంగా షిండే

Eknath Devendra

Eknath Devendra

మ‌హా రాష్ట్ర సీఎంగా ఫ‌డ్న‌విస్ ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌డానికి రంగం సిద్ధం అవుతోంది. అందుకోసం ఆ రాష్ట్ర రాజ్ భ‌వ‌న్ వ‌ర్గాలు ఏర్పాట్ల‌ను చేస్తున్నాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు కొన‌సాగిన మ‌హారాష్ట్ర రాజ‌కీయ సంక్షోభానికి శుక్ర‌వారంతో. తెర‌ప‌డ‌నుంది. వ్యూహాత్మ‌కంగా బీజేపీ వేసిన అడుగులు స‌క్సెస్ కావ‌డంతో అక్క‌డి సంకీర్ణ ప్ర‌భుత్వానికి శాశ్వ‌తంగా తెర‌ప‌డింది.

శివసేన రెబల్ ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ శుక్ర‌వారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ‌బోతున్నారు. గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారి సీఎం ఉద్ధవ్‌ను బ‌లం నిరూపించుకోవాల‌ని ఆదేశించ‌డంతో గురువారం రాత్రి పొద్దుపోయిన త‌రువాత రాజీనామా చేశారు. రెబ‌ల్ ఎమ్మెల్యేల తీరుతో వారం క్రితమే ఉద్ద‌వ్ సీఎంవో కార్యాలయాన్ని ఖాళీ చేయ‌డం ప్రారంభించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించగా సానుకూల నిర్ణ‌యం రాక‌పోవ‌డంతో అధికారికంగా ఉద్ధవ్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

మరోవైపు గోవాలోని తాజ్‌లో శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఏక్‌నాథ్ షిండే మాట్లాడారు.మహారాష్ట్రలోని బీజేపీ కోర్ గ్రూప్ ఉదయం 11 గంటలకు సమావేశం అయింది సంకీర్ణ శివసేన రెబల్స్‌తో కీలక చర్చలు జ‌ర‌పాల‌ని ఆ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు. పదవుల పంపకంపై కీల‌క చ‌ర్చ‌లు జ‌రిపారని తెలుస్తోంది.

మ‌హా రాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా షిండే ప్రమాణ స్వీకారం చేస్తార‌ని తెలుస్తోంది. సీఎం హోదాలో ఫ‌డ్న‌విస్ జులై 2న హైదరాబాద్‌లో జ‌రిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజ‌రు కానున్నారు. ఆ మేర‌కు బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద బీజేపీ వ్యూహాల‌కు మ‌రో రాష్ట్ర ప్ర‌భుత్వం కూలిపోయింది. క‌మ‌లం ఖాతాలోకి మ‌హారాష్ట్ర కూడా వెళ్లింది. ఇక దక్షిణాది రాష్ట్రాలు మాత్ర‌మే టార్గెట్ అంటూ హైద‌రాబాద్ కేంద్రంగా జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో దండ‌యాత్ర‌కు తెర‌తీయ‌బోతున్నారు. గ‌త మూడు వారాలుగా మ‌లుపులు తిరుగుతూ వ‌చ్చిన మ‌హారాష్ట్ర రాజ‌కీయానికి బీజేపీ తెర‌దించింది.