ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం (Chhattisgarh) సుక్మా జిల్లా(Sukma district)లోని పూవర్తి గ్రామం (Puvarti village) అభివృద్ధి దిశగా ముందడుగు వేసింది. స్వాతంత్య్రం వచ్చిన 78 ఏళ్ల తర్వాత ఈ గ్రామ ప్రజలు తొలిసారి టీవీ ద్వారా దేశ, ప్రపంచ వార్తలు, సీరియళ్లు, మరియు స్థానిక సినిమాలను చూడడం ప్రారంభించారు. ఇది మావోయిస్టు (Maoist ) ప్రభావిత ప్రాంతంలో కొత్త ఆశల వెలుగులు నింపింది. గ్రామంలోని పిల్లలు, మహిళలు, వృద్ధులు టీవీ సెట్ల వద్ద గంటల తరబడి కూర్చుని సందడి చేశారు.
సౌర శక్తితో పరిష్కారాలు :
గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అక్షయ శక్తి ఆధారిత పథకాలను అమలు చేసింది. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ నేతృత్వంలో ప్రతి ఇంటికి సౌర లైటింగ్ (Solar-powered appliances) మరియు ఫ్యాన్‌లు పంపిణీ చేయడంతో పాటు రెండు టీవీ సెట్లు కూడా ఏర్పాటు చేశారు. దీనిద్వారా గ్రామంలో విద్యుత్తు సమస్య తీరడంతో పాటు, ప్రజలు ఆధునిక సదుపాయాలను పొందడం ప్రారంభించారు.
విద్యకు కొత్త వెలుగు :
పిల్లలు టీవీ ప్రోగ్రామ్ల ద్వారా విద్యతో పాటు వినోదం పొందుతున్నారు. రాత్రిపూట సౌర లైటింగ్ వల్ల చదవడం సులభమైందని గ్రామస్థులు తెలిపారు. టీవీలో ప్రసారమయ్యే జ్ఞాన వృద్ధి కార్యక్రమాలు పిల్లలకు కొత్త సమాచారం అందిస్తున్నాయి. ఇది వారికి విద్యపై ఆసక్తి పెంచడంలో మేలైన మార్గం అవుతుంది.
ప్రజల సంతోషాలు..కొత్త ఆశలు :
సౌర శక్తి ఆధారిత పరికరాలు గ్రామస్తుల జీవితాల్లో కొత్త ఆశలను తీసుకొచ్చాయి. తక్కువ వనరుల మధ్య తమ గ్రామంలో టీవీ వస్తుందని ఎప్పుడూ ఊహించని గ్రామ ప్రజలు, ఇప్పుడు ప్రపంచంతో అనుసంధానం కలిగినట్లు వాంతం వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి దిశగా కొత్త అడుగులు :
పూవర్తి గ్రామంలో సౌర శక్తి పరికరాల ద్వారా విద్యుత్తు సమస్యల్ని అధిగమించి, శాంతి మరియు అభివృద్ధికి పునాది వేస్తున్నట్లు కలెక్టర్ దేవేష్ కుమార్ ధృవ్ తెలిపారు. అక్షయ శక్తి వినియోగం, పరిసర పరిరక్షణకు దోహదం చేస్తూ, గ్రామీణ అభివృద్ధికి కొత్త మార్గాలు సృష్టించనుంది. ఈ తరహా చర్యలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వతమైన శాంతికి దోహదం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also : Rahul Gandhi : మోదీ ప్రభుత్వం యువత బొటనవేలును కోరుతోంది..