‘కాశీ’లో అయోధ్య త‌ర‌హా వివాదం

హిందువులు ప్ర‌ముఖంగా కొలిచే కాశీ క్షేత్రంలో అయోధ్య త‌ర‌హా వివాదం నెల‌కొంది. ఆ క్షేత్రాన్ని ఆనుకుని ఉన్న మ‌సీదు వెనుక మ‌రో హిందూ దేవాల‌యం ఉంద‌ని తాజాగా వెలుగుచూసింది. దానిపై భ‌క్తులు కోర్టుకు వెళ్లారు.

  • Written By:
  • Publish Date - May 7, 2022 / 03:06 PM IST

హిందువులు ప్ర‌ముఖంగా కొలిచే కాశీ క్షేత్రంలో అయోధ్య త‌ర‌హా వివాదం నెల‌కొంది. ఆ క్షేత్రాన్ని ఆనుకుని ఉన్న మ‌సీదు వెనుక మ‌రో హిందూ దేవాల‌యం ఉంద‌ని తాజాగా వెలుగుచూసింది. దానిపై భ‌క్తులు కోర్టుకు వెళ్లారు. ఆ క్ర‌మంలో మ‌సీదు లోప‌ల భాగాన్ని వీడియో తీయాల‌ని కోర్టు ఇచ్చిన ఆదేశంపై ముస్లింలు ఆగ్ర‌హంగా ఉన్నారు. మ‌సీదు లోప‌ల ఆవ‌ర‌ణ‌లో వీడియో చిత్రీక‌రించ‌డానికి నిరాకరించ‌డంతో వివాదం నెల‌కొంది.

వారణాసిలోని విశ్వనాథుని ఆలయం పక్కనే ఉన్న మసీదును కోర్టు నియమించిన కమిషనర్, న్యాయవాదులు పరిశీలించారు. ప్రార్థనలు ముగిసిన అనంతరం మసీదు వెలుపలి భాగాన్ని శుక్రవారం ప్ర‌త్యేక బృందం అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భద్రతను కల్పించారు. శనివారం కూడా ఈ పరిశీలన కొనసాగనుంది. ఈ మసీదుకు ముందు హిందూ మందిరం ఉందంటూ, ఏడాది పాటు సందర్శనకు అనుమతించాలంటూ స్థానిక కోర్టులో గతేడాది ఒక పిటిషన్ దాఖలైంది. దీంతో మసీదు ప్రాంతాన్ని తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలంటూ స్థానిక కోర్టు ఆదేశించింది. ఇందుకు ఒక కమిషనర్ ను నియమించింది. మసీదు పశ్చిమ భాగంలో ఉన్న మా శృంగార్ గౌరీ స్థలాన్ని ఏడాది అంతటా సందర్శించేందుకు అనుమతించాలని మహిళలు పిటిషన్ లో కోరారు. ప్రస్తుతం అక్క‌డ ఏడాదికి ఒక్కసారే అనుమతిస్తున్నారు.

సదరు స్థలాన్ని పరిశీలించడంతోపాటు, వీడియోలు తీసి మే 10 నాటికి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయితే, మసీదు నిర్వహణ కమిటీ మసీదు లోపల వీడియోలకు అనుమతించబోమని స్పష్టం చేసింది. మసీదు ప్రాంతాన్ని పరిశీలించేందుకు స్థానిక కోర్టు ఇచ్చిన ఆదేశాలను మసీదు సంరక్షణ కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేయడం గమనార్హం.