Site icon HashtagU Telugu

Dera Baba: డేరా బాబా పెరోల్ రగడ…!!!

Dera Baba

Dera Baba

డేరా బాబా అత్యాచారం, హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దోషి. అయితే.. హరియాణాలో ఏ ఎన్నిక వచ్చినా.. ఆయనకు పెరోల్‌ గ్యారంటీ..ఇప్పుడితే అధికార, విపక్షాల మధ్య అగ్గి రాజేస్తోంది. ఎన్నికలొచ్చిన ప్రతిసారి హరియాణా ప్రభుత్వం ఆయనకు పెరోల్ ఇస్తోందని మండిపడుతున్నాయి విపక్షాలు. ఈ ఏడాదిలో డేరాబాబాకు మూడుసార్లు పెరోల్ మంజూరైంది. ఈసారి ఏకంగా 40రోజులు లాంగ్ లీవ్‌. జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి డేరాబాబా చేస్తున్న హంగామా మామూలుగా లేదు. దీపావళి సందర్భంగా సొంత మ్యూజిక్ ఆల్బమ్‌ రిలీజ్‌ చేశారు. ఈ వీడియోకు యూట్యూబ్‌లో మొదటిరోజే రికార్డు స్థాయిలో 42 లక్షల వ్యూస్ వచ్చాయి. పెరోల్‌పై రిలీజ్‌ అయిన నేరస్తుడు ఈ తరహా ప్రచార హంగామా చేయవచ్చా అనేది బిగ్ క్వశ్చన్‌. కాగా, డేరా బాబా మాత్రం అసలు తగ్గడం లేదు.

దత్తపుత్రికగా చెప్పుకునే హనీప్రీత్‌కు కొత్త పేరు పెట్టారు. రుహానీ దీదీ అని నామకరణం చేశారు. మరోవైపు ఆన్‌లైన్‌లో సత్సంగాలు నిర్వహిస్తున్నారు డేరాబాబా. లక్షల మంది వీటిని ఫాలో అవుతున్నారు. గత వారం నిర్వహించిన ఆన్‌లైన్ సత్సంగ్‌కు కర్నాల్ మేయర్ రేణుబాలా సహా పలువురు హరియాణా బీజేపీ నేతలు హాజరవడం వివాదాస్పదంగా మారింది. డేరా బాబా పెరోల్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా. రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని విమర్శలు గుప్పించారు. దేశంలో పెరోల్ రిజిస్ట్రేషన్‌ను కోడిఫైడ్ చేయాలంటూ ట్వీట్ చేశారు మహువా. రేపిస్ట్‌ గుర్మీత్‌ రామ్ రహీమ్‌ పెరోల్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్.

ఆధ్యాత్మిక గురువుగా ఓ వెలుగువెలిగిన డేరా బాబా.. అత్యాచారం, హత్య కేసుల్లో దోషిగా తేలి 2017లో జైలుపాలయ్యారు. కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు పెరోల్‌పై విడుదల అవుతారు. గడిచిన ఐదేళ్లలో ఆయనకు ఐదుసార్లు పెరోల్‌ మంజూరైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు, జూన్‌లో హరియాణా మున్సిపల్ ఎన్నికలప్పుడు డేరాబాబాకు పెరోల్ వచ్చింది. తాజాగా హరియాణాలో నవంబర్ 3న అదంపూర్ ఉపఎన్నిక, నవంబర్ 9, 12 తేదీల్లో 9 జిల్లాల్లో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే డేరా బాబాకు హరియాణా సర్కార్‌ పెరోల్‌ ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మాత్రం ఇందులో ప్రభుత్వ జోక్యం లేదంటున్నారు. నిబంధనల ప్రకరమే పెరోల్ మంజూరైందని చెప్పుకొచ్చారు.