Gurmeet Ram Rahim Granted 40-Day Parole for 15th Time అత్యాచారం, హత్య కేసుల్లో దోషిగా తేలి.. జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు మరోసారి పెరోల్ లభించింది. ఈ కేసుల్లో అతడు దోషిగా తేలిన 2017 నుంచి ఆయనకు పెరోల్ రావడం ఇది 15వ సారి కావడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అయితే డేరా బాబాకు పెరోల్ వచ్చిన ప్రతీసారి.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఆయనకు పెరోల్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు హర్యానా ప్రభుత్వం మరోసారి పెరోల్ మంజూరు చేసింది. దీంతో డేరా బాబా 40 రోజుల పాటు జైలు నుంచి బయటికి రానున్నారు. గడిచిన 8 ఏళ్లలో డేరా బాబా జైలు నుంచి బయటికి రావడం ఇది 15వ సారి కావడం గమనార్హం. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కొన్నిరోజుల ముందు ఇలా డేరా బాబాకు పెరోల్ లభించడం రాజకీయ వర్గాల్లో తరచూ తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. రేప్, మర్డర్ కేసులో దోషిగా తేలిన డేరా బాబాకు కోర్టు శిక్ష విధించడంతో జైలులో ఖైదీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా డేరా సచా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరోసారి పెరోల్ రావడంతో.. ఆయన రోహ్‌తక్ జిల్లాలోని సునారియా జైలు నుంచి బయటికి వచ్చారు. ఈ కేసులో 2017లో దోషిగా తేలినప్పటి నుంచి డేరా బాబాకు 15వ సారి పెరోల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. తన వద్ద పనిచేసే ఇద్దరు అనుచరులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా చీఫ్ రామ్ రహీమ్‌కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు.. 16 ఏళ్ల క్రితం జరిగిన ఒక జర్నలిస్ట్ హత్య కేసులో కూడా డేరా బాబాను 2019లో కోర్టు దోషిగా తేల్చింది.
తాజాగా 40 రోజుల పెరోల్ రావడంతో.. ఆయన అప్పటివరకు సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయంలో ఉంటారని డేరా ప్రతినిధి జితేందర్ ఖురానా వెల్లడించారు. గత కొన్నేళ్లుగా సరిగ్గా ఎన్నికలకు ముందు రామ్ రహీమ్ పెరోల్‌పై బయటకు రావడంపై తీవ్ర చర్చకు దారితీస్తోంది. 2026 ఫిబ్రవరిలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు డేరా బాబాకు పెరోల్ లభించడం గమనార్హం. గతంలో 2024 అక్టోబర్‌లో హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు.. అంతకుముందు 2022 పంజాబ్ ఎన్నికలకు ముందు కూడా ఆయనకు ఇలాగే పెరోల్ మంజూరు కావడంతో బయటికి వచ్చారు.
డేరా బాబాకు పెరోల్ రావడంపై తీవ్ర నిరసనలు
పదే పదే డేరా చీఫ్ రామ్ రహీమ్ సింగ్‌కు పెరోల్ ఇచ్చి జైలు నుంచి విడుదల చేయడాన్ని సిక్కు మత సంస్థ అయిన శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ వంటి సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తీవ్ర నేరం చేసిన వ్యక్తికి పదే పదే ఉపశమనం కలిగించడం న్యాయ వ్యవస్థను అవమానించడమేనని వారు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు.. హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో డేరా బాబాకు భారీ సంఖ్యలో అనుచరులు ఉండటం వల్ల రాజకీయ పార్టీలు ఆయనను ప్రసన్నం చేసుకునేందుకే ఇలా పెరోల్ మంజూరు చేసి.. ఆయనకు వెసులుబాటు కల్పిస్తున్నాయనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
