Gujarat: గుజరాత్‌ ఎన్నికల వేళ బీజేపీకి ఎదురుదెబ్బ..!

గుజరాత్‌ ఎన్నికల వేళ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.

  • Written By:
  • Updated On - November 11, 2022 / 04:28 PM IST

గుజరాత్‌ ఎన్నికల వేళ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కేసరిసిన్హ్ సోలంకి ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు. సోలంకి మాతర్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి ఆయనకు బీజేపీ టికెట్‌ ఇవ్వలేదు. దీంతో సోలంకి ఆప్‌ గుజరాత్‌ చీఫ్‌ గోపాల్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయన కష్టపడే, భయంలేని ఎమ్మెల్యే అని ఆప్‌ కొనియాడింది.

బీజేపీ టికెట్ నిరాకరించడంతో గుజరాత్‌లోని ఖేడా జిల్లాలోని మాతర్‌ అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కేసరిసిన్హ్ సోలంకి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరారు. ఓబీసీ నేత అయిన సోలంకిని ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా పార్టీలోకి స్వాగతిస్తూ ట్విట్టర్ పోస్ట్‌లో ప్రకటించారు. అయితే ఆప్ మతార్ స్థానంలో మహిపత్‌సింగ్ చౌహాన్‌ను పోటీకి దింపింది. బీజేపీ గురువారం 160 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పుడు తొలగించిన 38 మంది ఎమ్మెల్యేలలో సోలంకీ ఒకరు. మాతర్ టికెట్ కల్పేష్ భాయ్ పర్మార్ కు ఇచ్చారు.

కేసరిసిన్హ్ సోలంకి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మాతర్ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ పటేల్‌పై ఆయన 2,406 ఓట్ల (1.45%) ఆధిక్యంతో విజయం సాధించారు. అక్టోబర్ 3న ఖేడా జిల్లాలోని ఉంధేలా గ్రామంలో జరిగిన గార్బా సంబంధిత హింసాకాండలో నిందితులుగా ఉన్న నలుగురైదుగురు వ్యక్తులను కొట్టడానికి పోలీసులను ప్రేరేపించారని రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సోలంకి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సోలంకి ఉంధేలాకు వచ్చారని ఈ కేసులో నిందితులు ఆరోపించారు.