Site icon HashtagU Telugu

Supreme Court : ఇళ్ల కూల్చివేతలు..అస్సాం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court

Assam government: బుల్డోజర్‌తో ఇళ్లను కూల్చివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అస్సాం ప్రభుత్వం ఉల్లంఘించిందంటూ దాఖలైన పిటిషన్‌పై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ అయ్యాయి. అక్కడి కామరూప్‌ మెట్రో డిస్ట్రిక్ట్‌ పరిధిలోని సోనపుర్‌ మువాజ ప్రాంతానికి చెందిన 47 మంది పౌరులు దాఖలు చేసిన పిటిషన్‌ను నేడు జస్టిస్‌ బీఆర్‌ గవయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ బెంచ్‌ పరిశీలించింది. దీనిపై మూడు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని సూచించింది. ప్రస్తుతానికి అక్కడ కూల్చివేతలను ఆపేయాలంటూ స్టేటస్‌కో కొనసాగించాలని పేర్కొంది.

Read Also: Tension at Telangana Bhavan : తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత..

సుప్రీం ఆదేశాలు లేకుండా దేశంలో ఎక్కడా కూల్చివేతలు చేపట్టొద్దని సెప్టెంబర్‌ 17న న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను అస్సాం ప్రభుత్వం ఉల్లంఘించిందని న్యాయవాది హౌజెఫా అహ్మది పేర్కొన్నారు. సోనపుర్‌లో అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మార్కింగ్‌ చేసి కూల్చివేతలు మొదలుపెట్టినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఇదే అంశంపై గువహటి హైకోర్టులో అడ్వొకేట్‌ జనరల్‌ ఇచ్చిన ప్రమాణపత్రాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీనిలో సదరు పిటిషన్లపై విచారణ పూర్తయ్యేవరకు కూల్చబోమని పేర్కొన్నారని, అయినా కూల్చివేతలు జరుగుతున్నట్లు వెల్లడించారు.

సోనపుర్‌లోని కచుతొలి పథార్‌ గ్రామానికి చెందిన 47 కుటుంబాలకు చెందిన ఇళ్లను కూల్చివేయాలని నిశ్చయించారు. ఇక్కడి వారు అసలైన భూ యజమానుల నుంచి కొనుగోలు చేసి.. పవర్‌ ఆఫ్‌ అటార్నీలు పొంది అక్కడ జీవిస్తున్నట్లు అధికారులకు చెప్పారు. మరోవైపు ప్రభుత్వ అధికారులు మాత్రం ఇక్కడ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలకు దిగారననేది బాధితుల ప్రధాన ఆరోపణ. రోడ్లు, ఫుట్‌పాత్‌లు, రైల్వే లైన్లు, వాటర్‌బాడీస్‌లో ఉన్న నిర్మాణాలను తప్పితే.. మిగిలిన వాటిని కూల్చే ముందు న్యాయస్థానాల అనుమతి తప్పనిసరి అంటూ సెప్టెంబర్‌ 17న కోర్టు చెప్పింది. అయినా తమ ఇళ్లను కూల్చడంపై బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Read Also: CM Chandrababu : పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష