Site icon HashtagU Telugu

Azad’s New Party:గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ పేరు ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’..!

Ghulam nabi azad

Ghulam nabi azad

జమ్ముకశ్మీర్‌లో మరో రాజకీయ పార్టీ పురుడుపోసుకుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సోమవారం కొత్త పార్టీ పేరు, జెండా ఆవిష్కరించారు. కొత్త పార్టీ పేరు ‘‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’’ అని తెలిపారు. ‘‘నా కొత్త పార్టీ కోసం దాదాపు 1500 పేర్లను ఉర్దూ, సంస్కృతంలో పరిశీలించాం. హిందీ, ఉర్దూ కలయిక ‘హిందుస్తానీ’. పేరు ప్రజాస్వామ్యంగా, శాంతియుతంగా, స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే తన కొత్త పార్టీకి ‘‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’’ అనే పేరును ఖరారు చేశారు. మీడియా సమావేశంలో ఈ పేరును వెల్లడించారు.

గులాం నబీ ఆజాద్ తన కొత్త ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’ జెండాను కూడా ఆవిష్కరించారు. పసుపు, తెలుపు, నీలం మూడు రంగులతో ఆ జెండా ఉంది. పసుపు రంగు సృజనాత్మకత భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుందని, తెలుపు శాంతిని సూచిస్తుందని, నీలం స్వేచ్ఛకు ప్రతీక అని ప్రకటించారు. గాంధీ సిద్ధాంతాల‌కు అనుగుణంగా త‌మ పార్టీ ప‌నిచేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

గులాం నబీ ఆజాద్ 2014 నుంచి 2021 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2005 నుంచి 2008 వరకు జమ్ముక‌శ్మీర్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1973 నుంచి ఆయన కాంగ్రెస్‌లో పనిచేస్తూ వచ్చారు. 1980 అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1980లో లోక్‌సభకు ఎన్నికయ్యాక కేంద్ర మంత్రివర్గంలో కూడా చేరారు. 73 ఏళ్ల ఆజాద్ ఆగస్ట్ 26న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన గులాం నబీ ఆజాద్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు కురిపించిన విష‌యం తెలిసిందే.

పార్టీలో ఎలాంటి కీలక పదవిలో లేనప్పటికీ.. అన్ని నిర్ణయాలు రాహులే తీసుకుంటారని ఆరోపించారు. రాహుల్ కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా మారిన తర్వాతే పార్టీ పతనం ప్రారంభమైందంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆజాద్‌కు మద్దతుగా జమ్ముక‌శ్మీర్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి తారాచంద్ సహా సుమారు 12 మంది ప్రముఖ కాంగ్రెస్ నేతలు కూడా ఆ పార్టీకి రాజీనామా చేసిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. గులాం న‌బీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన త‌ర్వాత జ‌మ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీకి చాలా మంది కార్య‌క‌ర్త‌లు రాజీనామా చేశారు.