Air India : టాటా చేతికి ఎయిర్ ​ఇండియా…

ఎయిర్​ ఇండియా టాటాల గూటికి చేరనుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడనుంది.

  • Written By:
  • Publish Date - January 27, 2022 / 05:13 PM IST

ఎయిర్​ ఇండియా టాటాల గూటికి చేరనుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడనుంది. ఎయిర్​ఇండియా ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం బిడ్స్​పిలిచిన విషయం తెలిసిందే. అందరికంటే ఎక్కువగా రూ. 18 వేల కోట్లకు టాటా గ్రూప్​ బిడ్​ వేసింది. టాటా గ్రూప్​లోని ఒక సబ్సిడరీ కంపెనీ తలేస్​ ప్రైవేట్​ లిమిటెడ్​ ఈ బిడ్​ను దాఖలు చేసింది. దీంతో కిందటేడాది అక్టోబర్​ 8 న ఈ కంపెనీకే ఎయిర్​ ఇండియా దక్కినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పైలట్లకు చెల్లించాల్సిన బకాయిలలో భారీగా కోత విధించడంతో లీగల్​ యాక్షన్​ తీసుకోనున్నట్లు మరోవైపు రెండు పైలట్​ యూనియన్లు ఎయిర్​ ఇండియా సీఎండీ విక్రమ్​ దేవ్​ దత్​కు వార్నింగ్​ ఇచ్చాయి. ఈ కోత చట్ట విరుద్ధమని, వెంటనే సరి చేయాలని రెండు యూనియన్లు కోరుతున్నాయి. తమకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా డిమాండ్​ చేస్తున్నాయి. ఈ మేరకు సీఎండీకి ఒక లెటర్​ను పంపాయి. బాడీ మాస్​ ఇండెక్స్​ (బీఎంఐ) కొలవాలనే కొత్త రూల్​ను ఇంకో రెండు ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఫ్లైట్​ ఎక్కేముందు ఎయిర్​పోర్టులలో కేబిన్​ సిబ్బంది బీఎంఐ కొలవాలనే రూల్​ను తెస్తున్నట్లు ఎయిర్​ ఇండియా మేనేజ్​మెంట్​ జనవరి 20 న ప్రకటించింది. డీజీసీఏ రూల్స్​కు ఇది వ్యతిరేకమని యూనియన్లు వాదిస్తున్నాయి. తమ వైఖరి తెలియచేస్తూ దత్​కు ఎయిర్​ ఇండియా ఎంప్లాయీస్​ యూనియన్​, ఆల్​ ఇండియా కేబిన్​ క్రూ అసోసియేషన్​లు లెటర్​ రాశాయి.

గ్రూప్​లో మూడో ఎయిర్​లైన్స్​ కంపెనీ…..
ఎయిర్​ ఇండియాను టాటా గ్రూప్​నకు అమ్మేసినట్లు అక్టోబర్​8 న ప్రకటించిన మూడు రోజుల తర్వాత ప్రభుత్వం లెటర్​ ఆఫ్​ ఇంటెంట్​ జారీ చేసింది. అక్టోబర్​ 25 న టాటా గ్రూప్​తో షేర్​ పర్చేజ్​ అగ్రిమెంట్​ (ఎస్​పీఏ)ను ప్రభుత్వం కుదుర్చుకుంది. అన్ని ఫార్మాలిటీస్​ పూర్తి కావడంతో గురువారం టాటా గ్రూప్​నకు ఎయిర్​ ఇండియాను అప్పచెప్పనున్నట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. ఎయిర్​ ఇండియాతోపాటు, ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​, ఎయిర్​ ఇండియా ఎస్​ఏటీఎస్​లు కూడా టాటాల చేతికి రానున్నాయి. టాటాలకు పోటీగా స్పైస్​ జెట్​ ప్రమోటర్​ అజయ్​ సింగ్​ రూ. 15,100 కోట్లకు బిడ్​ వేశారు. ప్రభుత్వం ఎయిర్​ ఇండియాకు రూ. 12,906 కోట్లను రిజర్వ్​ ధరగా అంతకు ముందు నిర్ణయించింది. నష్టాలలో కూరుకుపోయిన ఎయిర్​ ఇండియాను ప్రైవేటు రంగానికి అప్పచెప్పాలని చాలా ఏళ్లుగా ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోంది. ఎయిర్​ ఇండియాలో నూరు శాతం వాటాను ప్రైవేటు రంగానికే ప్రభుత్వం ఇచ్చేస్తోంది. ఎయిర్​ ఇండియా చేతికి రావడంతో టాటా గ్రూప్​లోని ఎయిర్​లైన్​ బ్రాండ్ల సంఖ్య మూడుకు చేరుతోంది. ఎయిర్​ ఏషియా ఇండియా, విస్తారాలలో ఇప్పటికే టాటా గ్రూప్​కు మెజారిటీ వాటా ఉంది. సింగపూర్​ ఎయిర్​లైన్స్​ లిమిటెడ్​తో కలిసి టాటా గ్రూప్​ఈ జాయింట్​వెంచర్లను ఏర్పాటు చేసింది.